Gerdau Steel Factory
-
గెర్దావ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తతపై స్పందించిన జేసీ!
-
గెర్దావ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. స్పందించిన జేసీ!
సాక్షి, అనంతపురం : తాడిపత్రి గెర్దావ్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కార్మికులు చనిపోయినా యాజమాన్యం సెలవు ఇవ్వలేదని కార్మికులు ఆందోళనకు దిగారని తెలుస్తోంది. దీంతో కార్మికులకు మద్దతుగా జనసేన నేతలు, కార్యకర్తలు గెర్దావ్ ఫ్యాక్టరీని ముట్టడించారు. కాగా, ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటేలా ఉందని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. గెర్దావ్ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గెర్దెవ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో యాజమాన్యం, కార్మికులు ఇద్దరిదీ తప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి మెరుగైన ఆర్థిక పరిహారం ఇవ్వాలని జేసీ సూచించారు. అంతేకాక మృతుల కుటుంబీకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వంలో మాట్లాడుతానని ఎంపీ చెప్పారు. కానీ, రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటం సరికాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత: వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
-
గెర్దావ్ ఫ్యాక్టరీపై సెక్షన్ 304 కింద కేసు నమోదు
-
తాడిపత్రిలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళనలు దిగాయి. తాడిపత్రి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. అయితే వీరిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రత్యేక బలగాలను మొహరించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఐదు ఎకరాల పొలం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకుల అండదండలతో యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. నామమాత్రంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మృతులందరూ రోజువారి కూలీ చేసుకొనే బడుగు జీవులని, వారికి నష్ట పరిహారం అందించి కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి దాదాపు 20గంటలు గడిచినా యాజమాన్యం స్పందించలేదని ధ్వజమెత్తారు. యాజమాన్యానికి వారికి జేసీ బ్రదర్స్ అండదండలు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. జేసీ బ్రదర్స్‌కు స్టీల్ కంపెనీ నెలకు దాదాపు పది కోట్ల రూపాయలను చెల్లిస్తోందని, అందుకే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు నోరు మెదపలేదని ఆరోపించారు. గొప్పలు చెప్పుకునే జేసీ బ్రదర్స్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడలేదని ధ్వజమెత్తారు. అధికార పక్ష నేతలుగా జేసీ సోదరులు వెంటనే స్పందించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షం, వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. అప్రజాస్వామికంగా అరెస్టులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఫ్యాక్టరీపై కేసు నమోదు : గెర్దావ్ ఫ్యాక్టరీపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం ఏఎస్సీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేసినట్లు చెప్పారు. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీక్ కావడంతో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లి సమీపంలో ఉన్న గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని పిగ్ఐరన్ (ముడి ఇనుము)వేడి చేసేందుకు ఉపయోగించే కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. పరిశ్రమలోని రోలింగ్ విభాగంలో సుమారు 400 అడుగుల లోతు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ పైపు వాల్వును ఓ కార్మికుడు తిప్పడంతో అందులోని వాయువు లీకై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు కార్మికులు.. స్పృహతప్పి పడిపోయిన సహచరుడిని బయటికి తీసుకొచ్చేందుకు అండర్‌గ్రౌండ్‌లోకి దిగారు. వారు కూడా లోపలికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువు పీల్చి స్పృహతప్పిపోయారు. ఈ ఘటన తెలిసి పరిశ్రమలో అలజడి రేగింది. కార్మికులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పృహతప్పి పడిపోయిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈఘటనతో తాడిపత్రిలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో వసీం, గురువయ్యలు పరిశ్రమ సిబ్బంది కాగా గంగాధర్, లింగమయ్యలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ మలోల హుటాహుటీన తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే పరిశ్రమ యాజమాన్యం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి వెలుగులోకి రానీయ కుండా చేసిందన్నారు. ప్రశ్నించిన కార్మికులపై యాజ మాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో అఖిలపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమేశ్‌రెడ్డి, పైల నరసింహయ్య తేల్చిచెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తాం.. గెర్డావ్ స్టీలు పరిశ్రమలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించామని పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమలో ఉన్న సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అన్న వివరాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతులు: 1. రంగనాథ్ (21) (తాడిపత్రి మండలం బోడాయిపల్లి), 2.గంగాధర్ (35) (అనంతపురం జిల్లా తుమ్మళ్ల మార్కపల్లి), 3.వసీమ్ (37) (కర్నూలు జిల్లా బేతంచెర్ల), 4.లింగయ్య (35) (వైఎస్సార్ జిల్లా కోడిగాండ్లపల్లి), 5.గురువయ్య (37) (ప్రకాశం జిల్లా గాండ్లపల్లి), 6.మనోజ్ (25) (అనంతపురం జిల్లా తాడిపత్రి). వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీలో విషాదం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది. దీంతో ఆ వాయువును పీల్చిన వారిలో రంగనాథ్, మనోజ్, లింగయ్య, గంగాధర్, వసీమ్, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మిగిలిని కార్మికులు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే విషవాయువు లీకైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. కార్బన్ మోనాక్సైడ్ లీకవటంతో ప్రమాదం జరిగిట్టు ప్రాథమిక సమాచారం. 400 చదరపు అడుగుల గదిలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా లీకైనట్టు తెలుస్తోంది. తొలుత ముగ్గురు మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారందరూ నిరుపేదలుగా తెలుస్తోంది. ఉపాధి కోసం వారు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పనికి వెళ్లిన వారు విగతజీవులు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. విష వాయువు బారినపడిన బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను తాడిపత్రి ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేశ్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం, ఒక ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో ఉద్రిక్తత గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేత జిలాన్ బాషాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.