అప్పు నిప్పుకు కుటుంబం ఆహుతి | Debt Tragedy: Family Commit Suicide In Khammam | Sakshi
Sakshi News home page

khammam: అప్పు నిప్పుకు కుటుంబం ఆహుతి

Published Mon, Jan 3 2022 10:14 AM | Last Updated on Tue, Jan 4 2022 8:02 AM

Debt Tragedy: Family Commit Suicide In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం:  చేసిన వ్యాపారం కలిసి రాలేదు. అప్పు లేమో ఎక్కువయ్యాయి. సొంత ఆస్తులు అమ్మేసి తీరుద్దామనుకున్నాడు. కానీ అనుకున్నట్టు ఆస్తులు చేతికి రాలేదు. దీంతో రుణాలు తీర్చే మార్గం లేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇంట్లో గ్యాస్‌ లీక్‌ చేసి నిద్రపోతున్న భార్య, కూతుర్లతో పాటు తనపైనా పెట్రోల్‌ పోసుకొని నిప్పం టించుకున్నాడు. ఆ ప్రమాదంలో భార్యాభర్తలు, ఓ కూతురు కాలి ముద్దయ్యారు.

మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం తెల్లవారు జామున ఈ విషాదం జరిగింది. తన చావుకు తన తల్లి సూర్యవతి, అక్క మాధవి, ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్‌ రావే కారణమని రాసిన సూసైడ్‌ నోట్‌ బాధితుడి కారులో దొరికింది. 

వ్యాపారాల్లో భారీ నష్టం
పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ (38) గతంలో పాల్వంచలో మీ సేవా కేంద్రం నడిపించాడు. నష్టాలు వచ్చి మూసే శాడు. తర్వాత వైజాగ్‌లో మగ్గం వర్క్‌ వ్యాపారం చేసినా నష్టాలే వచ్చాయి. ఓ ఆన్‌లైన్‌ యాప్‌లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు సమాచారం.

సుమారు రూ.30 లక్షల మేర అప్పు అయినట్టు తెలుస్తోంది. వీటిని తీర్చేందుకు మరికొంత అప్పు కోసం స్థానికంగా పలువురిని సంప్రదించినా ఫలితం లేకపోవడం, ఇల్లు అమ్ముదామనుకున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్థానికుల వద్ద వాపోయేవాడని తెలిసింది.

తన తల్లి, అక్క.. ఎమ్మెల్యే కొడుకేనా?
తల్లి సూర్యవతి ఇటీవల కొత్తగూడెం ఆస్పత్రిలో పనిచేసి రిటైర్‌ కాగా.. ఆ వచ్చిన డబ్బు తనకిస్తే అప్పులు తీరుస్తానని రామకృష్ణ అడుగుతున్నాడు. అయితే ఆయన అక్క మాధవి ఆస్తిలో వాటా కోసం తల్లిని అడుగుతోందని, తనకు ఆస్తి దక్కకుండా చేస్తోందని మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. రామకృష్ణ–మాధవి మధ్య ఆస్తి తగాదా సెటిల్‌మెంట్‌కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్‌ఎస్‌ నేత రాఘవేందర్‌రావును సంప్రదించినట్టు సమాచారం.

అయితే పాల్వంచలోని ఇంటితో పాటు గోకవరం, హైదరాబాద్, రాజమండ్రిల్లోని ఇళ్ల స్థలాల పంపకంలో అక్క మాధవి, తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పి తనకు అన్యాయం చేశాడని రామకృష్ణ భావించినట్లు సమాచారం. 

తల్లి బయటకు వచ్చి కేకలు వేయడంతో..
అప్పులు తీర్చు మార్గం లేక సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రామకృష్ణ తన ఇంట్లో గ్యాస్‌ లీక్‌ చేశాడు. తర్వాత నిద్రలో ఉన్న భార్య శ్రీలక్ష్మి (33), కవల కుమార్తెలు సాహిత్య (13), సాహితితో పాటు తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. మంటలు తాళలేక సాహితి కేకలేస్తూ ఇంటి తలుపు గడి తీసి బయటకు వచ్చి పడిపోయింది. పక్కనే మరో గదిలో తల్లి సూర్యవతి వెంటనే బయటకు వచ్చి పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు చేరుకున్నారు.

ఫైర్‌ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్‌ ఇంజన్లు చేరుకుని మంటలను ఆర్పేశాయి. అప్పటికే నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీ లక్ష్మి, సాహిత్య మంటల్లో పూర్తిగా కాలిపోయారు. పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజు, సీఐ సత్యనారాయణ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని డాగ్‌ స్కాడ్, క్లూస్‌ టీమ్‌ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. శ్రీలక్ష్మి తమ్ముడు జనార్దన్‌ ఫిర్యాదు మేరకు రాఘవేందర్‌ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవిపైన, తనతో పాటు మరో ఇద్దరి మృతికి కారణమైన రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

కలకలం రేపిన సూసైడ్‌ నోట్‌
ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌ కలకలం రేపింది. తన చావుకు రాఘవేందర్‌ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవే కారణమంటూ నోట్‌లో పేర్కొన్నాడు. నోట్‌ను ఇంటి ముందు పార్క్‌ చేసిన కారులో పెట్టి స్నేహితుడికి వాట్సప్‌ ద్వారా విషయం చెప్పాడు. కారులోని సూసైడ్‌ నోట్‌ను ఏఎస్పీ రోహిత్‌ రాజు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 6 నెలలుగా ఏపీలోని రంపచోడవరంలో ఉంటున్న రామకృష్ణ ఇటీవలే పాల్వంచలోని ఇంటికి రాగా ఆయన భార్య శ్రీలక్ష్మి ఆదివారం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేందర్‌రావుపై ఇప్పటికే భూసెటిల్‌మెంట్లు, పైరవీల ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో చక్రం తిప్పుతారనే విమర్శలున్నాయి. గతంలో పాల్వంచ పట్టణానికి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి తనకు చెందాల్సిన స్థలం రిజిస్ట్రేషన్‌ విషయంలో కొందరు అడ్డుపడుతున్నారని ఆత్మహత్య చేసుకొని సూసైడ్‌ నోట్‌ రాశారు. అందులో ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్‌రావు పేరు కూడా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ పునరావృతమైంది.

సాహితి పరిస్థితి విషమం
మంటల్లో 80 శాతం కాలిన రామకృష్ణ కుమార్తె సాహితి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఏఎస్పీ రోహిత్‌ రాజు ఆమెతో మాట్లాడారు. తాము నిద్రలో ఉండగా తండ్రి పెట్రోల్‌ పోశాడని, వాసన రావడంతో లేచి చూడగా నిప్పంటించాడని, మంటలు తట్టుకోలేక తాను బయటకు వచ్చినట్టు సాహితి చెప్పిందని ఏఎస్పీ వెల్లడించారు.

కావాలనే కుట్ర చేశారు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను రామకృష్ణకు ఎలాంటి అన్యాయం చేయలేదు. గత నెల 26న రామకృష్ణ తన తల్లి సూర్యవతి, అక్క మాధవితో కలిసి నా దగ్గరికి వచ్చాడు (నేను పిలవలేదు). వారి సమస్య విని అన్యాయం చేయొద్దని తల్లికి చెప్పి పంపా. కుటుంబ విషయం కాబట్టి వాళ్లనే పరిష్కరించుకోమన్నా. లేఖలో నా పేరెందుకు రాశాడో తెలియదు. నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు కుట్ర పన్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు.

– వనమా రాఘవేందర్‌రావు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement