
గాందీ ఆస్పత్రి: దోమలగూడ వంట గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అయిదుగురిలో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. ధనలక్ష్మి, పద్మ, అభినవ్‌లు శుక్రవారం మరణించగా, బుధవారం శరణ్య మృతి చెందింది. దోమలగూడ రోజ్‌గార్ కాలనీకి చెందిన పద్మ అనే మహిళ బోనాల వేడుకలకు పద్మారావునగర్ బాపూజీనగర్‌లో నివసిస్తున్న కుమార్తె ధనలక్ష్మి, ఎల్‌బీనగర్‌లో ఉంటున్న సొంత చెల్లెలు నాగమణి కుటుంబాలను ఆహా్వనించింది. ధనలక్ష్మితోపాటు భర్త లాలాజీ శ్యామ్, కుమార్తె శరణ్య, కుమారులు అభినవ్, విహాన్‌లు, చెల్లెలు నాగమణి, భర్త ఆనంద్‌లు ఈ నెల 10న రోజ్‌గార్ కాలనీలోని పద్మ ఇంటికి చేరుకున్నారు.
మంగళవారం పిండివంటలు చేసేందుకు స్టవ్‌ను వెలిగించగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఒకే గదిలో ఉన్న ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అదే సమయంలో అల్లుడు శ్యామ్ బయటకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. మంటలను అదుపుచేసి గాయపడిన ఏడుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులను పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్‌వార్డుల్లో వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. చికిత్స పొందుతూ బుధవారం శరణ్య (7), శుక్రవారం పద్మ (53) ధనలక్ష్మి (29) అభినవ్ (8) మృతి చెందారు.
నేను ఎవరి కోసం బతకాలి..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పద్మారావునగర్ బాపూజీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. అత్త, భార్య, ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, మరో చిన్నారి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తాను ఇంకా ఎవరికోసం బతకాలని శ్యామ్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను బాపూజీనగర్‌కు తరలించి ముషీరాబాద్ మొరంబంద శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడిన మరో చిన్నారి విహాన్ (3) ఆల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు ఆనంద్, నాగమణిల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.