మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప
హొస్పేట, న్యూస్‌లైన్ : గుజరాత్ ముఖ్యమంత్రిని దేశ ప్రధానిగా చూడాలని దేశప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. హొస్పేటలోని సహకార కల్యాణ మంటంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేయాలన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రాథమిక స్థాయి నుంచి కార్యకలాపాలు చేపట్టామని తెలిపారు.
బీజేపీ హయాంలో రాష్ర్టం ఎంతో అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు. రైతుల సమస్యలపై మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం చెరుకు, వక్క తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. పాకిస్థాన్ సైనికులు భారత సైనికులను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి హతమారుస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఇలాంటి సంఘటనలకు అస్కారం ఉండదన్నారు. దేశం ఆర్థిక, విద్య, సైనిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. ఇందుకు కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీలో కుమ్ములాటలవల్లే రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, నాయకులు రామలింగప్ప, అశోక్ గస్తీ, విధాన పరిషత్ ముఖ్యనేత శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు సోమలింగప్ప తదితరులు పాల్గొన్నారు.
ప్రజల చూపంతా మోడీపైనే
Published Mon, Dec 23 2013 2:04 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement