people service
-
ఎక్కడ పోలీస్?
రెడ్డెప్పఆచారిది ములకలచెరువు మండలం దేవలచెరువు. వృత్తిపని చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. సర్కారిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని ప్రయత్నిస్తే ఓ టీడీపీ సర్పంచ్.. అతని బావమరిది అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. చేసేది లేక ప్రాణాలే తీసుకున్నాడు. భార్యాబిడ్డలు అనాథలయ్యారు. జగన్నాథరెడ్డి..విమల దంపతులది యాదమరి మండలం వరిగపల్లి. తమకున్న కొద్దిపాటి భూమితో బతుకుతున్నారు. ఒక రౌడీషీట్ నమోదైన వ్యక్తితో భూ తగాదా ఉంది. దీనిపై స్థానిక పోలీసులను వారు ఆశ్రయించారు. సకాలంలో స్పందించలేదు. ఈలోగా(డిసెంబర్ 8న)ఆ రౌడీషీటరు తన ట్రాక్టరుతో విమలను తొక్కించి మరీ చంపేశాడు. జిల్లాలో శాంతిభద్రతలు ఏ స్థితిలో ఉన్నాయో తెలిపే సంఘటనలివి. అధికారులతో సఖ్యతగా ఉండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాల్సిన అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. అధికార అండతో అధికారులు, సామాన్య ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే భావన సామాన్యుల్లో పెరిగిపోతోంది. అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని చిత్తూరుకు చెందిన టీడీపీ నేత యువరాజులు నాయుడు కార్పొరేషన్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ దళిత అధికారిని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేíసినా ఫలితం లేకపోయింది.. చిత్తూరు, సాక్షి: అధికార పార్టీ నాయకుల ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయి. అధికారం మాటున పోలీసులను పావుల్లా వాడుకుంటూ దౌర్జన్యాలకు తెరలేపుతున్నారు. రోజురోజుకూ బాధితులు పెరిగిపోతున్నారు. తమను ఎవరైనా ఎదిరిస్తే చాలు... మహిళలని కూడా చూడకుండా ఒంటిమీద చేయి పడాల్సిందే. నోటికి పని చెప్పాల్సిందే. శాంతిపురం మండలంలో ఒక మహిళను ఇటీవల కొందరు వివస్త్రను చేసి దాడిచేశారు. సంఘటలు జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిసున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మత్స్యశాఖకు సంబంధించిన భూమి ఉంది. ఆ భూమిని ఎలాగైనా పార్టీ ఆఫీసు కోసం కొట్టేయాలని టీడీపీ నాయకులు భావించారు. మత్స్యశాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగుల వెంటబడి వేధించారు. అప్పట్లో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పోలీసులు అండగా ఉండటంతో దీన్ని కేసుగానే పరిగణించలేదు. వీ కోట మండలం యాలకల్లులో అనుమతులు లేకుండా మైనింగ్ పనులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నందుకు ప్రభాకర్ అనే వ్యక్తిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టించారు. పెనుమూరు మండలం మణియానంపల్లెలో తమను అడగకుండా ఇల్లు కట్టుకున్నాడని బాలయ్య అనే రజకుడి ఇంటిని కూలదోశారు టీడీపీ నాయకులు. దీనిపై బాలయ్య పోలీస్‌స్టేషన్‌కు చెప్పులరిగేలా తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. బాలయ్యకు నిలువనీడ లేకుండా చేశారు. కేసులే లేవు.. అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నాయకుల ఫిర్యాదులంటేనే కొంత మంది పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక వేళ అధికార పార్టీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయలన్నా గంటల తరబడి కొందరు పోలీసులు స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ధైర్యం చేసి కేసులు కట్టినా... ఆ ఆఫీసర్లపై వెంటనే వేటు పడుతోంది. రామకుప్పం సీఐ వేణుగోపాల్ రెడ్డిని ఉదహరిస్తున్నారు. టైలర్ కాన్వెంట్ భూముల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి బీసీ నాగరాజుపై కేసు నమోదు చేసినందుకు ఆయన్ను బదిలీ చేశారు. టీడీపీ నాయకుల వల్ల కావచ్చు, ఇతర రాజకీయ పార్టీ నాయకుల వల్ల కావచ్చు సామాన్యులకు అన్యాయం జరిగితే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.స్థానికంగా న్యాయం జరగకపోతే నా దగ్గరకు రండి. చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు. -
రైతుల చెంతకే బ్యాంక్!
రైతు సేవలో పేరూరు ఏపీజీబీ గ్రామాల్లోకి వెళ్లి పంట రుణాలు పంట రుణాలు తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేయాలన్నా.. గంటల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిందే. బ్యాంక్ లావాదేవీలు అర్థం కాని ఇలాంటి తరుణంలోనే పలువురు రైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధానానికి రామగిరి మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, పేరూరు శాఖ ఉద్యోగులు స్వస్తి పలికారు. రోజుల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడకుండా.. వారి సమయాన్ని, డబ్బును ఆదా చేసే సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. - రామగిరి (రాప్తాడు) ఆర్థిక లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్న బ్యాంక్‌లలో ఏ చిన్న పొరబాటు జరిగినా.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనన్న ఆందోళన ఉద్యోగులను వేధిస్తూ ఉంటుంది. ఈ తరహా ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు.. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఖాతాదారుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చిందులు వేస్తుంటారు. అయితే పేరూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ ఉద్యోగులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఇంటి వద్దకే పంట రుణాలు, రెన్యూవల్స్ సమయంలో బ్యాంక్‌ల చుట్టూ రోజుల తరబడి రైతులు తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో పొలాల్లో పనులు వదులుకుని, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇది జిల్లాలో ఏ బ్యాంకు వద్దనైనా ఖాతాదారులకు నిత్యం ఎదురయ్యే సమస్యే. అయితే ఏపీజీబీ పేరూరు శాఖలో రైతులు వేచి ఉండాల్సిన పనిలేదు. అంతేకాక పంట కాలంలో బ్యాంక్ అధికారులే నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రుణాలు మంజూరు, రెన్యూవల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయం తెలియక ఎవరైనా రైతులు బ్యాంక్ వద్దకు వస్తే.. సగౌరంగా వారిని కూర్చొబెట్టి బ్యాంక్ వద్దకు కాకుండా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తామంటూ నచ్చచెప్పి పంపుతున్నారు. ఇందుకు సంబంధించి ముందస్తుగానే షెడ్యూల్‌ను ప్రకటించి, ఆ మేరకు గ్రామాల్లో బ్యాంక్ అధికారులు పర్యటిస్తూ పంట రుణాలు రెన్యూవల్ చేస్తున్నారు. ఐదు గ్రామాల్లో పర్యటిస్తూ.. ఏపీజీబీ పేరూరు శాఖ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 5,500 మంది రైతులకు రూ. 51 కోట్ల పంట రుణాలను బ్యాంక్ అధికారులు అందజేశారు. ప్రస్తుతం కొత్త రుణాల కింద ఎకరాకు అన్ని బ్యాంక్‌లు రూ. 18 వేలు ఇస్తుండగా... పేరూరులోని ఏపీజీబీ ద్వారా రూ. 21 వేలు ఇస్తున్నారు. వినూత్నమైన సేవలను అందిస్తూ కరువు రైతులకు అండగా నిలిచిన బ్యాంక్ మేనేజర్ జూడాస్, ఫీల్డ్ ఆఫీసర్ సంజీయరాయుడుని ఈ సందర్భంగా పలువురు రైతులు అభినందిస్తున్నారు. దళారుల బెడద తప్పింది బ్యాంకు అధికారులు ఇంటివద్దకే వచ్చి రుణాలు రెన్యూవల్ చేస్తుండడంతో రైతులకు దళారుల బెడద తప్పింది. మా గ్రామాల్లోకే వచ్చి రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో మా సమయం, డబ్బు ఆదా అవుతోంది. - సావిత్రమ్మ, మహిళా రైతు, పేరూరు రైతులు ఇబ్బందులు పడకూడదనే రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడకూడదనే గ్రామాల్లోకి వెళ్లి వడ్డీ మాత్రమే కట్టించుకుని పంట రుణాలు రెన్యూవల్స్ చేస్తున్నాం. మా సిబ్బంది సహకారంతోనే ఈ విధానం అమలు పరుస్తున్నాం. - జూడాస్, బ్యాంక్ మేనేజర్