రెడ్డెప్పఆచారిది ములకలచెరువు మండలం దేవలచెరువు. వృత్తిపని చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. సర్కారిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుందామని ప్రయత్నిస్తే ఓ టీడీపీ సర్పంచ్.. అతని బావమరిది అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. చేసేది లేక ప్రాణాలే తీసుకున్నాడు. భార్యాబిడ్డలు అనాథలయ్యారు.
జగన్నాథరెడ్డి..విమల దంపతులది యాదమరి మండలం వరిగపల్లి. తమకున్న కొద్దిపాటి భూమితో బతుకుతున్నారు. ఒక రౌడీషీట్ నమోదైన వ్యక్తితో భూ తగాదా ఉంది. దీనిపై స్థానిక పోలీసులను వారు ఆశ్రయించారు. సకాలంలో స్పందించలేదు. ఈలోగా(డిసెంబర్ 8న)ఆ రౌడీషీటరు తన ట్రాక్టరుతో విమలను తొక్కించి మరీ చంపేశాడు.
జిల్లాలో శాంతిభద్రతలు ఏ స్థితిలో ఉన్నాయో తెలిపే సంఘటనలివి. అధికారులతో సఖ్యతగా ఉండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాల్సిన అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. అధికార అండతో అధికారులు, సామాన్య ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే భావన సామాన్యుల్లో పెరిగిపోతోంది.
అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని చిత్తూరుకు చెందిన టీడీపీ నేత యువరాజులు నాయుడు కార్పొరేషన్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ దళిత అధికారిని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేíసినా ఫలితం లేకపోయింది..
చిత్తూరు, సాక్షి: అధికార పార్టీ నాయకుల ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయి. అధికారం మాటున పోలీసులను పావుల్లా వాడుకుంటూ దౌర్జన్యాలకు తెరలేపుతున్నారు. రోజురోజుకూ బాధితులు పెరిగిపోతున్నారు. తమను ఎవరైనా ఎదిరిస్తే చాలు... మహిళలని కూడా చూడకుండా ఒంటిమీద చేయి పడాల్సిందే. నోటికి పని చెప్పాల్సిందే. శాంతిపురం మండలంలో ఒక మహిళను ఇటీవల కొందరు వివస్త్రను చేసి దాడిచేశారు. సంఘటలు జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిసున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మత్స్యశాఖకు సంబంధించిన భూమి ఉంది. ఆ భూమిని ఎలాగైనా పార్టీ ఆఫీసు కోసం కొట్టేయాలని టీడీపీ నాయకులు భావించారు. మత్స్యశాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగుల వెంటబడి వేధించారు. అప్పట్లో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పోలీసులు అండగా ఉండటంతో దీన్ని కేసుగానే పరిగణించలేదు. వీ కోట మండలం యాలకల్లులో అనుమతులు లేకుండా మైనింగ్ పనులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నందుకు ప్రభాకర్ అనే వ్యక్తిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టించారు. పెనుమూరు మండలం మణియానంపల్లెలో తమను అడగకుండా ఇల్లు కట్టుకున్నాడని బాలయ్య అనే రజకుడి ఇంటిని కూలదోశారు టీడీపీ నాయకులు. దీనిపై బాలయ్య పోలీస్‌స్టేషన్‌కు చెప్పులరిగేలా తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. బాలయ్యకు నిలువనీడ లేకుండా చేశారు.
కేసులే లేవు..
అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నాయకుల ఫిర్యాదులంటేనే కొంత మంది పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక వేళ అధికార పార్టీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయలన్నా గంటల తరబడి కొందరు పోలీసులు స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారు. ధైర్యం చేసి కేసులు కట్టినా... ఆ ఆఫీసర్లపై వెంటనే వేటు పడుతోంది. రామకుప్పం సీఐ వేణుగోపాల్ రెడ్డిని ఉదహరిస్తున్నారు. టైలర్ కాన్వెంట్ భూముల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి బీసీ నాగరాజుపై కేసు నమోదు చేసినందుకు ఆయన్ను బదిలీ చేశారు.
టీడీపీ నాయకుల వల్ల కావచ్చు, ఇతర రాజకీయ పార్టీ నాయకుల వల్ల కావచ్చు సామాన్యులకు అన్యాయం జరిగితే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.స్థానికంగా న్యాయం జరగకపోతే నా దగ్గరకు రండి. చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment