పోలీసులపై దాడి కేసులో ‘ఎల్లో’ గ్యాంగ్‌ను కాపాడే యత్నం
మండిపడుతున్న సిబ్బంది
పోలీస్ సంఘం నోటికి పచ్చ తాళం..!
పాకాల(తిరుపతి రూరల్) : పోలీస్ శాఖ లో ఆయనో త్రిబుల్ స్టార్ అధికారి. ప్రజా రక్షణను విస్మరించి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడమే ఆయన కర్తవ్యమని చిత్తూరు జిల్లా పోలీస్ శాఖలో మంచి పేరు సాధించారు. మండలస్థాయి చోటా నాయకులకు సైతం ఆయన సలాం చేస్తారనే అపవాదు మూటగట్టుకున్నారు. ‘‘అయ్యా.. మమ్మల్ని పలానావాళ్లు కొట్టారు.. పిడిగుద్దులు కురి పించారు.. పోలీసులకు చెందిన వస్తువులను ధ్వంసం చేశారు.. వారిపై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయండి’’ అంటూ రాతపూర్వకంగా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయనపై పోలీసులే మండిపడుతున్నారు.
నిందితులను కాపాడే ప్రయత్నం
పాకాలలో పోలీసు అధికారులు, కానిస్టేబుల్‌పై ప్రత్యక్ష దాడులకు తెగబడిన ఎల్లో గ్యాంగ్‌ను కాపాడేందుకు ఓ త్రిబుల్ స్టార్ పోలీస్ అధికారి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొని పోలీసులపై కర్రలు, రాడ్లు, ఇనుప పైపులతో దాడిచేసిన వీడియోలున్నా.. ప్రత్యక్ష సాక్షుల రాతపూర్వక స్టేట్‌మెంట్లున్నా వాటిని సీడీ ఫైల్‌లో సైతం చూపించకపోవడంపై సిబ్బంది మండిపడుతున్నారు. ఎల్లో గ్యాంగ్‌తో అర్థిక లావాదేవీలవల్లే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆ పోలీసు అధికారిపై ఆ శాఖ సిబ్బందే ఆరోపిస్తున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లోని 8మంది నిందితుల్లో ఇద్దరి పేర్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళ్లేదుటే నింది తులు తిరుగుతున్నా వారిని అరెస్ట్ చేయకపోవడంపై మండిపడుతున్నా రు. ఇలాంటి అధికారి ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తే తమ ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఒక్కరిని తప్పించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ అధికారి తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
పోలీస్ సంఘం నోటికి పచ్చ తాళం
విధుల్లో ఉన్న పోలీసులపై దాడి జరిగినా పోలీస్ అధికారుల సంఘం మాత్రం స్పందించకపోవడంపై పోలీసులు మండిపడుతున్నారు. దాడిని ఖండించలేని వారు నాయకులుగా ఉండడం సిగ్గుచేటని ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు.