రాజకీయ వలయం | Political ring | Sakshi
Sakshi News home page

రాజకీయ వలయం

Published Sun, Sep 13 2015 4:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Political ring

 కర్నూలు : పోలీసుల శాఖపై నేతల పెత్తనం ఏ స్థాయిలో సాగుతుందో సీఐ బదిలీల ప్రక్రియ చెప్పకనే చెబుతోంది. అప్రాధాన్యత పోస్టులోని సమర్థుడైన ఒక్క అధికారికీ బదిలీల్లో అనువైన చోటు దక్కకపోవడం నాలుగో సింహం పరువును బజారున పడేస్తోంది. అధికార పార్టీ నేతలకు సహకరించలేదనే కారణంతో కొన్ని నెలల క్రితం వీఆర్‌కు వచ్చిన ఓ ఇన్‌స్పెక్టర్‌కు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌కు నియమిస్తామని రేంజ్ స్థాయి అధికారి ఇచ్చిన హామీ కూడా నాయకుల పంతంతో మరుగున పడింది.

సుదీర్ఘకాలం జిల్లాలో పనిచేసి సాధారణ ఎన్నికల పుణ్యమా అని కడప జిల్లాకు బదిలీ అయిన ఓ అధికారి స్థానిక ఎమ్మెల్యే సిఫారసుతో ఖాళీగా ఉన్న ఆ సర్కిల్‌లో పాగా వేశారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌కు మాజీ మంత్రుల సిఫారసు మేరకు రామకృష్ణను నియమించిన ట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కర్నూలులో కీలకమైన మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌లోనూ మాజీ మంత్రి తనకు అనుకూలమైన వ్యక్తిని ఈ బదిలీల్లో నియమించుకున్నట్లు చర్చ జరుగుతోంది.

మధుసూదన్‌రావు ప్రస్తుతం తిరుపతి ట్రాఫిక్‌లో అటాచ్ విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సిఫారసు మేరకు కర్నూలుకు చెందిన మాజీ మంత్రి ఆయనను అనుకూలమైన స్టేషన్‌కు కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మరో ఇన్‌స్పెక్టర్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ద్వారా నంద్యాలలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈయన సోదరుడు సీఎం సెక్యూరిటీ వింగ్‌లో ముఖ్య అధికారిగా పని చేస్తున్నందున అధికార పార్టీ నేతల సిఫారసుతో పోస్టింగ్ దక్కిందనే చర్చ ఉంది. కడప జిల్లాకే చెందిన మరో అధికారి కూడా శిల్పా ద్వారానే పోస్టింగ్ వేయించుకున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన మరో అధికారి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా ఆయన నియోజకవర్గానికి చేరుకున్నారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో ఒక డీఎస్పీకి ఉన్న సన్నిహిత సంబంధంతో నంద్యాల నుంచి ఆదోని సర్కిల్ పోస్టులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ బదిలీల్లో వీఆర్‌లోని ఇద్దరు అధికారులకు పోస్టింగ్ దక్కగా, సర్కిల్‌లో పనిచేస్తున్న ము గ్గురు అధికారులను వీఆర్‌కు పంపుతూ శనివా రం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాయలసీమ ఐజీ గోపాలకృష్ణతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ శుక్రవారం రాత్రి బదిలీల ప్రక్రియపై కసరత్తు పూర్తి చేశారు. పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ప్యాపిలి, బేతంచెర్ల తదితర సర్కిళ్ల అధికారులపైనా రెండో విడత బదిలీల్లో వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement