సమావేశంలో మాట్లాడుతోన్న శిల్పాచక్రపాణి రెడ్డి
వెలుగోడు: మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో చంద్రబాబు కేంద్రంలోని తన పార్టీ మంత్రులతో రాజీనామా చేయించి డ్రామాలాడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ మద్దతివ్వాలని సూచించారు. శనివారం ఆయన వెలుగోడు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ ఎంపీల మాదిరిగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధపడితే దేశం మొత్తం మన వైపు చూస్తుందని, అప్పుడు కేంద్రం దిగొస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో టీడీపీ, బీజేపీ డ్రామా కంపెనీలుగా మారాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాలుగేళ్లుగా ఈ అంశాన్ని నీరుగార్చి.. ఇప్పుడు హఠాత్తుగా మాటమార్చారన్నారు. అదే వైఎస్ జగన్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తూ ప్రత్యేక హోదాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా రావన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు..చంద్రబాబు బతికుండగానే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బినామీగా మారారని, ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తుంటే జనసేన అధినేత మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు భారీ స్పందన లభిస్తుండడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. పుష్కరాల పేరుతో టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ డబ్బు రుణమాఫీ కింద జమ చేసి ఉంటే రైతులు బాగుపడేవారన్నారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో ‘వైఎస్‌ఆర్ గంగా హారతి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
‘నీరు– చెట్టు’లో దోపిడీ
టీడీపీ నేతలు నీరు– చెట్టు పథకంలో దోపిడీకి తెర లేపారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు కూడా మాట్లాడుతున్నారని, వారికి నైతిక విలువలు లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నీరు– చెట్టు పథకం, పాత లెట్రిన్ల బిల్లుల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై లోక్‌యుక్తా, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కేసీ కెనాల్‌లో చేపట్టే 200 ఆధునికీకరణ పనులపైనా కలెక్టర్, మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీడీపీ నాయకుల కోసమే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వీబీఆర్‌లో దాదాపు 7 టీఎంసీల నీరు ఉండగా.. మార్చి చివరి వరకు మాత్రమే నీరిస్తామని ఎమ్మెల్యే చెప్పడం శోచనీయమన్నారు. ఆలస్యంగా పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన చేపడతానని హెచ్చరించారు. టీజీపీలో రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల పనులు జరుగుతున్నాయని, వీటిని పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని సూచించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment