బదిలీల ‘బాబు’లు
తెలుగుదేశం పార్టీలో ‘బదిలీల బాబు’లు పుట్టుకొచ్చారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో మాంచి డిమాండ్ ఉన్న పోస్టు కావాలంటే అధికారులు ఈ బాబులనే ఆశ్రయిస్తున్నారు. టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగ్గా, జిల్లా స్థాయిలో అధికారుల బదిలీల్లో ఈ బాబులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం మాదే..అధికారం మాదేనంటూ హల్‌చల్ చేస్తున్నారు. తమను ‘ప్రసన్నం’చేసుకున్న అధికారులకు అడిగిన చోట పోస్టింగ్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నారు. ఆనక ఆ పోస్టు మీదేనంటూ అధికారులకు భరోసానిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: జిల్లాలో రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీల కలకలం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత బదిలీలు తప్పవని తెలుసుకున్న పలువురు అధికారులు ఇప్పటికే టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలసి తమకు నచ్చిన పోస్టును రిజర్వు చేయించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో కలెక్టర్, ఎస్పీల బదిలీలు పూర్తయ్యాయి. ఇక ఆర్డీఓ, తహశీల్దార్, డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారుల బదిలీలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరో వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ శాఖల్లో భారీగా బదిలీలు జరగనున్నట్టు తెలుసుకున్న ఈ శాఖల అధికారుల్లో కలకలం మొదలయింది.
మంచి పోస్టు పొందాలంటే టీడీపీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని తెలుసుకున్న అధికారులు తమ పరిధిలోని ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వీరిలో కొందరికి ఇప్పటికే పోస్టింగ్‌లపై హామీలు లభించగా, మరి కొందరు ద్వితీయశ్రేణి నాయకులను ఆశ్రయించి సిఫార్సులు చేయించుకుంటున్నారు.
ఇదే అదనుగా భావిస్తున్న ద్వితీయశ్రేణి నేతలు పోస్టింగ్‌లు ఇప్పిస్తామంటూ ‘ఒప్పందం’ చేసుకుని డబ్బులు చేతులు మార్చుకుంటున్నట్టు సమాచారం.
ఆర్డీఓ, డీఎస్పీ స్థాయి అధికారుల పరిధి రెండు, మూడు నియోజకవర్గాల వరకూ ఉండటంతో ఆ పోస్టుల నియామకం విషయంలో తీవ్ర పోటీ నెలకొంది.
గుంటూరు ఆర్డీఓగా తాను చెప్పిన వ్యక్తినే నియమించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇప్పటికే ఓ పేరు సూచించినట్లు తెలుస్తోంది.
గురజాల ఆర్డీఓను యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓను ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు సూచించిన వారినే నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
నరసరావుపేట ఆర్డీఓ, డీఎస్పీల నియామకంలో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు చెరొక పేరు సూచించినట్టు సమాచారం.
ఇక్కడ ఎవరి మాట నెగ్గుతుందోనని టీడీపీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఉన్నతాధికారులకు చేరిన జాబితాలు...
పదేళ్ల తరువాత అధికారం చేజిక్కడంతో టీడీపీ నేతలతోపాటు తెలుగు తమ్ముళ్లు కూడా మంచి కసిమీద ఉన్నారు.
తాము చెప్పినట్టు వినే అధికారులను మాత్రమే నియమించా లంటూ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
అన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ, పోలీస్ శాఖల్లోని తమకు కావలసిన ముఖ్యమైన అధికారుల జాబితాను ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందించినట్టు తెలుస్తోంది.
లూప్‌లైన్ పోస్టులే శ్రేయస్కరం ...
టీడీపీ నేతల దూకుడు చూసి కొందరు అధికారులు కీలక పోస్టులు తీసుకునేందుకు భయపడుతున్నారు.
ఇప్పటికే అధికారులతో అడ్డగోలు పనులు చేయిస్తున్న టీడీపీ నేతలు రానున్న రోజుల్లో మరింత ఉధ్రుతం చేసే అవకాశం ఉందని, దీనివల్ల తీవ్ర విమర్శలపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కొంతకాలం లూప్‌లైన్ పోస్టుల్లో ఉండటమే మంచిదంటూ భావిస్తున్నట్లు సమాచారం.