సాక్షి, కర్నూలు: అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే టీడీపీ శ్రేణులు అత్యుత్సాహాన్ని చూపుతున్నాయి. అంతా తామేనన్నట్లు ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం పోటాపోటీ పడుతున్నారు. తాజాగా తమకు అనుకూలమైన అధికారుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
ఎన్నికల సమయంలో ఏ అధికారి ఎలా పనిచేశారో ఆరా తీస్తున్నారు. ఏ పార్టీకైనా, అభ్యర్థికైనా మద్దతిచ్చారా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. అలాగే అవినీతికి దూరమా? దోచేసుకునే రకమా? ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఇతరత్రా వ్యాపకాలేమైనా ఉన్నాయా?..తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఎలాంటి గుర్తింపు ఉంది? ఆ అధికారిని కొనసాగించడం వల్ల మేలు జరుగుతుందా? లేదా? అని పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య అధికారుల పనితీరు గురించి గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు రహస్య విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. సైతం కొందరు అధికారులు, జిల్లా విభాగాధిపతుల గురించి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గత శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే కొందరు అధికారులు.. అధికార పార్టీ నేతలను ఆశ్రయించి జిల్లాలో కీలక పోస్టింగుల కోసం యత్నిస్తున్నారు. కర్నూలు ఆర్డీవో పోస్టు కోసం ఓ రెవెన్యూ అధికారి యత్నిస్తున్నారు.
ఈయన గతంలో కర్నూలు తహశీల్దారుగా పనిచేశారు. ఇటీవలే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నారు. జిల్లాలో ఒక ముఖ్యనేతను తరచూ కలిసి వెళ్తున్నారు. అలాగే డ్వామా, డీఆర్‌డీఏ, జిల్లా విద్య, వైద్య తదితర శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగే అవకాశాలు ఉండటంతో ఇదే అదునుగా ఈ పోస్టుల కోసం గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మండల స్థాయిలో కీలకమైన తహశీల్దారు, ఎంపీడీవో, ఎంఈవో, పీఆర్ ఏఈ, డీఈలు, విద్యుత్తు శాఖ ఏఈ, డీఈ పోస్టులతోపాటు కీలకమైన శాఖల్లో సూపరింటెండెంట్లుగా చోటు సంపాదించుకోవడానికి అధికారులతోపాటు ఉద్యోగులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే కొందరు అధికారులు మాత్రం ఇక్కడే కొనసాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఇప్పటి వరకు అప్రాధాన్య విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు ఫోకల్ స్థానాల కోసం పైరవీలు ప్రారంభించారు. తుంగభద్ర నది తీర ప్రాంతంలో ఉన్న మండలాలకు తీవ్రమైన పోటీ నెలకొంది.
ఇక్కడ ఇసుక రీచ్‌లు తదితర ఆదాయ వనరులు ఉండటంతో తీర మండలాలపై తహశీల్దార్లు కన్నేశారు. గతంలో అధికార పార్టీ, మరో పార్టీకి సహకరించారన్న విమర్శలను ఎదుర్కొన్న కొందరు అధికారులు.. పాలకపక్ష నేతలను విభిన్న మార్గాల్లో ప్రసన్నం చేసుకునే పనిలో తీరిక లేకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారుల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.