ఎటు చూసినా చీకటే.. ఆ సమయంలో మేమున్నాంటూ..
గొలుగొండ(విశాఖ జిల్లా): పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించినా లోటు తెలియకుండా పెంచారు.. వసతి కల్పించి, చదువు చెప్పించి పెంచి పెద్ద చేశారు.. పెళ్లి ఈడు రావడంతో చక్కని సంబంధం చూశారు.. ఊరంతా ఒక్కటై ఘనంగా వివాహం జరిపించారు.. కొత్త సంసారానికి కావలసిన సామగ్రిని సైతం తలా ఒకటి సమకూర్చారు.. అమ్మా నాన్నా ఉన్నా అంతకన్నా వేడుకగా జరపలేకపోయేవారేమో! ఇంతటి ఆదర్శవంతమైన ప్రేమానుబంధం వ్యక్తమైంది గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో.. ఆ అదృష్టవంతురాలి పేరు మాదబత్తుల అమరావతి.
చదవండి: యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి..
పసివయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి ఎటు చూసినా చీకటే.. ఆ సమయంలో మేమున్నాంటూ ముందుకు వచ్చారు బంధువులు, గ్రామస్తులు. గుండుపాల గ్రామానికి చెందిన మాదబత్తుల అమరావతి ఏనాడూ ఒంటరితనం అనుభవించలేదు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేది. రాత్రి సమయంలో సమీప బంధువుల ఇంట్లో కడుపు నింపుకునేది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ భూమిలో రేకుల షెడ్డు వేసి ఆమెకు బంధువులు నీడనిచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆమెకు యుక్త వయస్సు రావడంతో అందరూ కలిసి అక్షింతలు వేద్దామని నిర్ణయించుకున్నారు.
అమరావతిని పెళ్లి కూతుర్ని చేసిన గుండుపాల గ్రామస్తులు
అనుకున్నదే తడువుగా అమరావతికి పెళ్లి సంబంధాలు చూసేందుకు సిద్ధమయ్యారు. ఇదే మండలం లింగంపేటకు చెందిన బొద్దిన సురేష్ అయితే బాగుంటుందని అంతా నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు సరే.. పెళ్లి వేడుక అనేసరికి ఎంతో ఖర్చవుతుంది కదా.. దానిని సైతం అంతా భరించేందుకు ముందుకు వచ్చారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు చుక్కల రాము ముందుకువచ్చి బాధ్యత తీసుకున్నారు.
వీధిలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన వారంతా చెవులకు బంగారు ఆభరణాలు చేయించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి టేకు మంచం, కార్యదర్శి పరుపు, దిండ్లు, సచివాలయం మహిళా పోలీసులు బీరువా.. ఇలా తెలిసిన వారంతా చేతనైన సాయం చేసి అమరావతి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం రాత్రి అమరావతి పెళ్లి వేడుక లింగంపేటలో ఘనంగా నిర్వహించారు. అరకు ఎంపీ మాధవి భర్త శివప్రసాద్, మాజీ మంత్రి సతీమణి పద్మావతి వధూవరులకు నూతన వ్రస్తాలతోపాటు ఆర్థిక సాయం అందజేశారు. ఊరంతా కలిసి తమ ఇంట్లో వేడుకగా భావించి గుండుపాల ఆడబిడ్డగా అమరావతిని అత్తారింటికి సాగనంపారు.