person arrested
-
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్లోనూ ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్ దూల్‌పేట్‌కు చెందిన శివశంకర్ సింగ్ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు స్వాధీనం) -
ప్రేమిస్తావా.. యాసిడ్ పోయాలా!
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రేమిస్తావా లేక యాసిడ్ పోయాలా అంటూ ఓ యువకుడు నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను నిత్యం వేధించడంతో పాటు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను జలాల్పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు తనను ప్రేమించాలని నిత్యం వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రవి బుధవారం రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు వచ్చి రవిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు రవిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రవి ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
గల్ఫ్‌లో బందీ.. ఆగిన పెళ్లి
సాక్షి, కోనరావుపేట(కరీంనగర్) : కొద్దిరోజుల్లోనే కుమారుడి వివాహం.. ఇందుకోసం ఇంటికి రంగులు వేయించి ముస్తాబు చేశారు. ఇంటిముందర పచ్చని పందిరి ఏర్పాటు చేశారు. బంధుమిత్రులకు వివాహ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ నెల 26న జరిగే వివాహానికి తప్పక హాజరుకావాలని కోరారు. అక్కడ అమ్మాయి తరఫు వారు కూడా వివాహం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఎంతో సంబురంతో దుబాయి నుంచి బయలు దేరాడు వరుడు. అనూహ్య రీతిలో అక్కడి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో వధువు, వరుడి కుటుంబాలే కాదు.. రెండు గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. వివరాలు ఇవీ.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశం, లత దంపతుల కుమారుడు వంశీకృష్ణ(25) ఉపాధి కోసం 2018 జనవరి 11న నిమ్మపల్లికి చెందిన ఏజెంట్ ఆనందం ద్వారా దుబాయికి వెళ్లాడు. నెలకు రూ.20 వేల వేతనమని ఏజెంట్ చెప్పినా.. అక్కడకు వెళ్లాక రూ.8 వేలే ఇచ్చారు. వివాహం నిశ్చయం కావడంతో.. వంశీకృష్ణకు చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందినగో యువతితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మేనరికం కావడం, ఇదివరకే వధూవరులు పెళ్లిచూపులు చూసుకోవడంతో వంశీకృష్ణ వివాహానికి ఒప్పుకున్నాడు. తాను జూన్‌లో స్వగ్రామం వస్తానని, అప్పుడే ముహూర్తం ఖరారు చేయాలని తల్లిదండ్రులను కోరాడు. దీంతో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో అన్ని ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. బంధువులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంటికి వస్తూ జైల్లోకి... వంశీకృష్ణ జూన్ 3న అక్కడి నుంచి బయలు దేరాడు. అతడి వద్ద కంపెనీ వీసా లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. అంతే.. కుమారుడు వస్తున్నాడనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు హతాశయులయ్యారు. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన వారి ఇల్లు కళ తప్పింది. కుటుంబసభ్యులు, బంధువులు వంశీకృష్ణ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమారుడిని త్వరగా జైలు నుంచి విడిపించాలని తల్లిదండ్రులు కదిరె మల్లేశం, లత, సోదరుడు అరుణ్ వేడుకుంటున్నారు. -
అనుమానంతోనే అంతమొందించాడు!
సాక్షి, ఆదోని: కర్నూల్ జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమైనట్లు తేలింది. శనివారం తాలూకా సీఐ మురళీ, ఎస్ఐ సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు. బైచిగేరి గ్రామానికి చెందిన మహదేవకు మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన రాజేశ్వరితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే అదే గ్రామానికి చెందిన తెలుగు రంగన్న(51)తో తన భార్యకు వివాహేతర సంబంధమున్నట్లు మహదేవ అనుమానించాడు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఈనెల 18న మహదేవ రంగన్నతో కలిసి మద్యం సేవించి గొడవకు దిగాడు. క్షణికావేశంలో రంగన్నపై గొడ్డలి, కర్రతో దాడి చేసి చంపేశాడు. మృతుడి భార్య అంజినమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
అరుదైన బంగారు బల్లికి అంత రేటా..!
గువాహటి: మనం కనివినీ ఎరుగనంత విలువ చేసే ఓ అరుదైన జాతి బల్లిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత అరుదుగా కనిపించే కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బల్లిని గుర్తుతెలియని వ్యక్తి అక్రమ రవాణా చేస్తూ అసోం పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అరుదైన జాతి బల్లిని రవాణా చేస్తున్న వ్యక్తి కదలికపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు గువాహటి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే గువాహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న లగేజీని పరిశీలించగా అందులో ఓ అరుదైన జాతి బంగారు బల్లి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఏ ముఠాతో సంబంధాలున్నాయి, మరే ఇతర జాతి జీవులను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బల్లులకు ఈ స్థాయిలో కోట్ల విలువ ఉంటుందానని స్థానికలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి సమాచారంతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.