సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రేమిస్తావా లేక యాసిడ్ పోయాలా అంటూ ఓ యువకుడు నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను నిత్యం వేధించడంతో పాటు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు తనను ప్రేమించాలని నిత్యం వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు.
ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రవి బుధవారం రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు వచ్చి రవిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు రవిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రవి ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment