రాంబాబుగాడు... వాడి వ్యక్తిత్వ వికాస పాఠాలు!
నవ్వింత
ఈమధ్య మా రాంబాబు గాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాడు. ‘విజయానికి ఆరు మెట్లు’ చదివాడట. అయితే మెట్ల సంఖ్య ఎక్కువగా ఉందనీ, మరింత షార్ట్ కట్లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదనీ వెతుకుతున్నాడు. ‘విజయానికి రెండు మెట్లు’ అనో, ‘విజయానికి మెట్లు లేవ్!’ అనో ఇంకెవరైనా రాశారేమోనని కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో అదే లీస్టు అని తెలిశాక నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు.
‘‘ఒరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా! కానీ అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్‌తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించలేం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో’’ అని చెప్పి చూశా. కానీ వాడు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా.
అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్‌గా షేవ్ చేయించుకునీ, తన గోళ్లను నీట్‌గా ట్రిమ్ చేయించుకునీ... ‘తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయబోన’ంటూ స్నేహపూర్వకంగా ఓ ఏనుగును పలకరిస్తూ దాని తలపెకైక్కి... ‘‘మన స్నేహానికి గుర్తుగా నీకు ‘పంజా మసాజ్’ చేస్తా’’నందట.
ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం ‘‘స్టీఫెన్ పాలకోవా రచించిన ‘ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్’ లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత’’ అని నిట్టూర్చిందట. సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిదిలాగే ఉంటుంది. గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యోమొర్రోమంటే అడవిలో ఆర్డర్ తప్పుతుందని రాంబాబుగాడికి వివరించా. వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది.
ఓరోజు మా రాంబాబుగాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న రాంబాబు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అదంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి, చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకుపోయాడు. ‘‘దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగుపొరుగింటి వాళ్లను పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతారా...?’’అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమేననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన ఉపదేశాలు విని బాగుపడేవాడని బాధపడ్డాడు మా రాంబాబు.
ఓరోజున మా రాంబాబు ‘హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ అనే డేల్ కార్నెగీ పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. ‘‘ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్స్‌ను గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదాకోరా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనతలనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు.
అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు’’ అంటూ కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన ‘‘గెలుపుసరే బతకడం ఎలా?’’ పుస్తకంతో పాటూ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా.
వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమని, వ్యక్తిత్వవికాసం పేరిట అందరూ యూనిఫామ్ వేసుకున్నట్లు మూసగా ఉండటం లోపమే కదా! కాబట్టి ఆ పేరుతో లోపజ్ఞానం కలిగి ఉండటం కాదని చెప్పా. ఇలా మా రాంబాబుగాడి రెట‘మత మార్పిడి’ కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఒక బృహద్కృత్యానికి పూనుకున్నా. చూద్దాం ఏమంటాడో వాడు.
- యాసీన్