perur
-
రైతుల చెంతకే బ్యాంక్!
రైతు సేవలో పేరూరు ఏపీజీబీ గ్రామాల్లోకి వెళ్లి పంట రుణాలు పంట రుణాలు తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేయాలన్నా.. గంటల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిందే. బ్యాంక్ లావాదేవీలు అర్థం కాని ఇలాంటి తరుణంలోనే పలువురు రైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధానానికి రామగిరి మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, పేరూరు శాఖ ఉద్యోగులు స్వస్తి పలికారు. రోజుల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడకుండా.. వారి సమయాన్ని, డబ్బును ఆదా చేసే సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. - రామగిరి (రాప్తాడు) ఆర్థిక లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్న బ్యాంక్‌లలో ఏ చిన్న పొరబాటు జరిగినా.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనన్న ఆందోళన ఉద్యోగులను వేధిస్తూ ఉంటుంది. ఈ తరహా ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు.. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఖాతాదారుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చిందులు వేస్తుంటారు. అయితే పేరూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ ఉద్యోగులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఇంటి వద్దకే పంట రుణాలు, రెన్యూవల్స్ సమయంలో బ్యాంక్‌ల చుట్టూ రోజుల తరబడి రైతులు తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో పొలాల్లో పనులు వదులుకుని, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇది జిల్లాలో ఏ బ్యాంకు వద్దనైనా ఖాతాదారులకు నిత్యం ఎదురయ్యే సమస్యే. అయితే ఏపీజీబీ పేరూరు శాఖలో రైతులు వేచి ఉండాల్సిన పనిలేదు. అంతేకాక పంట కాలంలో బ్యాంక్ అధికారులే నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రుణాలు మంజూరు, రెన్యూవల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయం తెలియక ఎవరైనా రైతులు బ్యాంక్ వద్దకు వస్తే.. సగౌరంగా వారిని కూర్చొబెట్టి బ్యాంక్ వద్దకు కాకుండా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తామంటూ నచ్చచెప్పి పంపుతున్నారు. ఇందుకు సంబంధించి ముందస్తుగానే షెడ్యూల్‌ను ప్రకటించి, ఆ మేరకు గ్రామాల్లో బ్యాంక్ అధికారులు పర్యటిస్తూ పంట రుణాలు రెన్యూవల్ చేస్తున్నారు. ఐదు గ్రామాల్లో పర్యటిస్తూ.. ఏపీజీబీ పేరూరు శాఖ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 5,500 మంది రైతులకు రూ. 51 కోట్ల పంట రుణాలను బ్యాంక్ అధికారులు అందజేశారు. ప్రస్తుతం కొత్త రుణాల కింద ఎకరాకు అన్ని బ్యాంక్‌లు రూ. 18 వేలు ఇస్తుండగా... పేరూరులోని ఏపీజీబీ ద్వారా రూ. 21 వేలు ఇస్తున్నారు. వినూత్నమైన సేవలను అందిస్తూ కరువు రైతులకు అండగా నిలిచిన బ్యాంక్ మేనేజర్ జూడాస్, ఫీల్డ్ ఆఫీసర్ సంజీయరాయుడుని ఈ సందర్భంగా పలువురు రైతులు అభినందిస్తున్నారు. దళారుల బెడద తప్పింది బ్యాంకు అధికారులు ఇంటివద్దకే వచ్చి రుణాలు రెన్యూవల్ చేస్తుండడంతో రైతులకు దళారుల బెడద తప్పింది. మా గ్రామాల్లోకే వచ్చి రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో మా సమయం, డబ్బు ఆదా అవుతోంది. - సావిత్రమ్మ, మహిళా రైతు, పేరూరు రైతులు ఇబ్బందులు పడకూడదనే రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడకూడదనే గ్రామాల్లోకి వెళ్లి వడ్డీ మాత్రమే కట్టించుకుని పంట రుణాలు రెన్యూవల్స్ చేస్తున్నాం. మా సిబ్బంది సహకారంతోనే ఈ విధానం అమలు పరుస్తున్నాం. - జూడాస్, బ్యాంక్ మేనేజర్ -
తొమ్మిది ఇసుక ట్రాక్టర్ల సీజ్
రామగిరి (రాప్తాడు) : రామగిరి మండలం పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ‘అడిగే వారెవరు? అడ్డంగా తోడేద్దాం’ శీర్షికన ఈ నెల 20న ప్రముఖంగా ప్రచురితమైన ‘సాక్షి’ కథనంపై పోలీసులు స్పందించారు. రామగిరి సీఐ యుగంధర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు పెన్నానదిలో ఇసుకను తోడి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై దాడులు నిర్వహించారు. తొమ్మిది ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు.వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఏఎస్ఐ లోక్‌నాథ్, పోలీసులు మోహన్‌నాయక్, అల్తాఫ్. నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ఇదెక్కడి న్యాయం?
– అనుమతి లేకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు - రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి – సుజ్లాన్ గాలిమరల కంపెనీ ఇష్టారాజ్యం – బాధిత రైతుల ఆవేదన గాలిమరల కంపెనీ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. రైతుల నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు పాతేస్తోంది. ఇదేమని అడిగితే పోలీసులను ఉసిగొలుపుతోంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కంపెనీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతోంది. చేసేది లేక బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. - అనంతపురం అర్బన్ రామగిరి మండలం పేరూరులో సుజ్లాన్ కంపెనీ గాలి మరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని ఫీడర్‌కు పంపేందుకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తోంది. పట్టా భూముల్లో వాటి యజమానుల అనుమతి తీసుకోకుండా కంపెనీ నిర్వాహకులు విద్యుత్ స్తంభాలు పాతుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ స్తంభాన్ని పొలంలో ఏర్పాటు చేసినందుకు రూ.60 వేలు, రెండు స్తంభాలు ఏర్పాటు చేస్తే రూ.1.20 లక్షలు సదరు రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా రైతులకు డబ్బు ఇవ్వకుండానే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తోంది. కొందరికి మాత్రం ఒక స్తంభానికి రూ.5 వేలు చొప్పున ఇస్తోంది. యజమానులు అనుమతి తీసుకోకనే... పేరూరులోని ఈశ్యరయ్యకు చెందిన సర్వే నంబరు 65–3బీలోని ఆరు ఎకరాలు, రామాంజికి చెందిన 64–2బీలో 4.79 ఎకరాలు, తిమ్మక్కకు చెందిన 75–3బీలో 8.33 ఎకరాలు, కేసీ మల్లికార్జునకు చెందిన సర్వే నంబరు 39–2బీ/5బీలో 4 ఎకరాల భూమిలో రైతుల అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలు పాతారు. తమ గోడుని తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కి చెప్పుకున్నా నాయ్యం జరగలేదని బాధితులు వాపోయారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంటోందని, కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని చెబుతున్నారు. ‘రైతులకు అన్యాయం చేస్తున్నారు’ అనుమతి లేకుండా పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు గాలిమరల కంపెనీ అన్యాయం చేస్తోందని బాధిత రైతు కె.సి.మల్లికార్జున, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిన్నపెద్దన్న, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. పొలాలు తమవి కావంటూ విచారణ చేసిన పోలీసు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా తమ భూములు పెద్ద ఆస్తి అని, 1బీ, వెబ్‌ల్యాండ్‌లో కూడా తమ పేరిటే ఉన్నాయన్నారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు కూడా కంపెనీకి అనుకూలంగా వ్యహరిస్తే కేసు కూడా తీసుకోలేదన్నారు. ఇదేమని అడిగితే ఇబ్బంది పెట్టారని, దీంతో మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించామన్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కనగానపల్లి : అధికార పార్టీ పెద్దల అండంతో అక్రమార్కులు పెన్నానదిలో ఇసుకను తోడేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకొని లక్షలాది రూపాయలు ఆర్జించారు. ప్రసుత్తం ప్రజావసరాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ముసుగులో కూడా అధికార పార్టీ నాయకులు ఇసుకను మరింత అక్రమ రవాణా చేస్తున్నారు. రాప్తాడు నియోజక వర్గ పరిధిలో రామగిరి మండలంలోని పేరూరు సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంతో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్నానది పరవళ్లుతొక్కేది. ఈ నదిపై పేరూరు సమీపంలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. దీని దిగువ భాగన ఇసుక దిన్నలు 5 కిలోమీటర్ల పొడవున ఏర్పడ్డాయి. దీంతో కొన్నేళ్లుగా రాజకీయనాయకులు, దళారులు కలిసి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ప్రతి రోజూ పెన్నా ఇసుక రిచ్‌ల నుంచి 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇసుకను ఓ చోట డంపు చేసుకొని అక్కడి నుంచి లారీల్లో కర్ణాటకలోని బెంగుళూరు ప్రాంతానికి తరలించి భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. పేరూరుకు సమీపంలో ఉన్న గ్రామాలతో పాటు కర్ణాటకలోని తిరుమణి, వల్లూరు గ్రామాల్లో అధికంగా డంపులు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లారీ ఇసుకను రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు అమ్ముకొంటున్నారు. దీంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గాలిమరల యూనిట్లకూ ఈ ఇసుకనే వినియోగిస్తున్న తెలుస్తోంది. ప్రస్తుతం పెన్నానది ప్రాంతంలో ఎక్కడ చూసిన రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టు పక్కల 10 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలలో బోరుబావులలో నీరు అడుగంటిపోయి తాగేందుకు నీరుదొకడం గగనమైదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
పేరూరు (అనంతపురం): దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగింది. గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి దాటాక గ్రామంలోని ఆంధ్రప్రగతి బ్యాంక్ ఏటీఎం ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. అయితే.. స్థానికులు పసిగట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రామగిరి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరినీ బ్యాంకు వద్దకు అనుమతించకపోవటంతో ఎంత చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు.