యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కనగానపల్లి : అధికార పార్టీ పెద్దల అండంతో అక్రమార్కులు పెన్నానదిలో ఇసుకను తోడేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకొని లక్షలాది రూపాయలు ఆర్జించారు. ప్రసుత్తం ప్రజావసరాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ముసుగులో కూడా అధికార పార్టీ నాయకులు ఇసుకను మరింత అక్రమ రవాణా చేస్తున్నారు.
రాప్తాడు నియోజక వర్గ పరిధిలో రామగిరి మండలంలోని పేరూరు సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంతో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్నానది పరవళ్లుతొక్కేది. ఈ నదిపై పేరూరు సమీపంలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. దీని దిగువ భాగన ఇసుక దిన్నలు 5 కిలోమీటర్ల పొడవున ఏర్పడ్డాయి. దీంతో కొన్నేళ్లుగా రాజకీయనాయకులు, దళారులు కలిసి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ప్రతి రోజూ పెన్నా ఇసుక రిచ్‌ల నుంచి 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇసుకను ఓ చోట డంపు చేసుకొని అక్కడి నుంచి లారీల్లో కర్ణాటకలోని బెంగుళూరు ప్రాంతానికి తరలించి భారీగా సొమ్ము చేసుకొంటున్నారు.
పేరూరుకు సమీపంలో ఉన్న గ్రామాలతో పాటు కర్ణాటకలోని తిరుమణి, వల్లూరు గ్రామాల్లో అధికంగా డంపులు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లారీ ఇసుకను రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు అమ్ముకొంటున్నారు. దీంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గాలిమరల యూనిట్లకూ ఈ ఇసుకనే వినియోగిస్తున్న తెలుస్తోంది. ప్రస్తుతం పెన్నానది ప్రాంతంలో ఎక్కడ చూసిన రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టు పక్కల 10 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలలో బోరుబావులలో నీరు అడుగంటిపోయి తాగేందుకు నీరుదొకడం గగనమైదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.