ఇదెక్కడి న్యాయం?
– అనుమతి లేకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు
- రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి
– సుజ్లాన్ గాలిమరల కంపెనీ ఇష్టారాజ్యం
– బాధిత రైతుల ఆవేదన
గాలిమరల కంపెనీ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. రైతుల నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు పాతేస్తోంది. ఇదేమని అడిగితే పోలీసులను ఉసిగొలుపుతోంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కంపెనీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతోంది. చేసేది లేక బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
- అనంతపురం అర్బన్
రామగిరి మండలం పేరూరులో సుజ్లాన్ కంపెనీ గాలి మరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని ఫీడర్‌కు పంపేందుకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తోంది. పట్టా భూముల్లో వాటి యజమానుల అనుమతి తీసుకోకుండా కంపెనీ నిర్వాహకులు విద్యుత్ స్తంభాలు పాతుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ స్తంభాన్ని పొలంలో ఏర్పాటు చేసినందుకు రూ.60 వేలు, రెండు స్తంభాలు ఏర్పాటు చేస్తే రూ.1.20 లక్షలు సదరు రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా రైతులకు డబ్బు ఇవ్వకుండానే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తోంది. కొందరికి మాత్రం ఒక స్తంభానికి రూ.5 వేలు చొప్పున ఇస్తోంది.
యజమానులు అనుమతి తీసుకోకనే...
పేరూరులోని ఈశ్యరయ్యకు చెందిన సర్వే నంబరు 65–3బీలోని ఆరు ఎకరాలు, రామాంజికి చెందిన 64–2బీలో 4.79 ఎకరాలు, తిమ్మక్కకు చెందిన 75–3బీలో 8.33 ఎకరాలు, కేసీ మల్లికార్జునకు చెందిన సర్వే నంబరు 39–2బీ/5బీలో 4 ఎకరాల భూమిలో రైతుల అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలు పాతారు. తమ గోడుని తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కి చెప్పుకున్నా నాయ్యం జరగలేదని బాధితులు వాపోయారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంటోందని, కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని చెబుతున్నారు.
‘రైతులకు అన్యాయం చేస్తున్నారు’
అనుమతి లేకుండా పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు గాలిమరల కంపెనీ అన్యాయం చేస్తోందని బాధిత రైతు కె.సి.మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిన్నపెద్దన్న, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. పొలాలు తమవి కావంటూ విచారణ చేసిన పోలీసు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా తమ భూములు పెద్ద ఆస్తి అని, 1బీ, వెబ్‌ల్యాండ్‌లో కూడా తమ పేరిటే ఉన్నాయన్నారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు కూడా కంపెనీకి అనుకూలంగా వ్యహరిస్తే కేసు కూడా తీసుకోలేదన్నారు. ఇదేమని అడిగితే ఇబ్బంది పెట్టారని, దీంతో మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించామన్నారు.