current poles
-
చేయి తడపాల్సిందే..!
నారాయణపేట : నారాయణపేట ట్రాన్స్‌కో పరిధిలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో రైతులు, వినయోగదారులు నష్టాలపాలవుతున్నారు. తాజాగా ఓ నిరుపేద రైతుకు ప్రభుత్వం అందించిన నాలుగు విద్యుత్ స్తంభాల్లో మూడు స్తంభాలను తిరిగి తీసుకెళ్లారు. స్తంభానికి రూ.5వేలచొప్పున డీడీ నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన కుర్వ బుగ్గప్ప తన పొలానికి విద్యుత్ స్తంభాలు, తీగలను ఏర్పాటు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.5వేలకు పైగా డీడీని కట్టారు. జనవరి 22న కుర్వ బుగ్గప్ప పొలంలో కాంట్రాక్టర్ కతల్అహ్మాద్ నాలుగు స్తంభాలు పాతి రైతుతో పాతినట్లు సంతకాలు చేయించుకున్నారు. విద్యుత్ తీగలు అమర్చేందుకు బేరం విద్యుత్ తీగలు అమర్చేందుకు రూ.15 వేలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. బేరసారాలతో రూ. 7,500 వరకు చెల్లించేందుకు రైతు ముందుకొచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్ పాతిన నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలను వారం రోజుల క్రితం తిరిగి తీసుకెళ్లారు. ఈ విషయంపై రైతు బుగ్గప్ప పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‌తో ప్రాదేయపడిన ఫలితం లేకుండా పోయింది. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు వెంకోభతో కలిసి ట్రాన్స్‌కో డీఈ చంద్రమౌలికి ఈనెల7న ఫిర్యాదు చేశారు. ఈమేరకు రైతు పొలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో కాంట్రాక్టర్‌తో మాట్లాడి స్తంభాలు ఏర్పాటు చేయిస్తానని డీఈ హామీ ఇచ్చివెళ్లారు. మరెందరో రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ డీడీలు పట్టుకొని చెప్పులు అరిగేలా తిరుగుతున్న పరిస్థితి నారాయణపేటలో కొనసాగుతుందని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇదెక్కడి న్యాయం?
– అనుమతి లేకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు - రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి – సుజ్లాన్ గాలిమరల కంపెనీ ఇష్టారాజ్యం – బాధిత రైతుల ఆవేదన గాలిమరల కంపెనీ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. రైతుల నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు పాతేస్తోంది. ఇదేమని అడిగితే పోలీసులను ఉసిగొలుపుతోంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కంపెనీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతోంది. చేసేది లేక బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. - అనంతపురం అర్బన్ రామగిరి మండలం పేరూరులో సుజ్లాన్ కంపెనీ గాలి మరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని ఫీడర్‌కు పంపేందుకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తోంది. పట్టా భూముల్లో వాటి యజమానుల అనుమతి తీసుకోకుండా కంపెనీ నిర్వాహకులు విద్యుత్ స్తంభాలు పాతుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ స్తంభాన్ని పొలంలో ఏర్పాటు చేసినందుకు రూ.60 వేలు, రెండు స్తంభాలు ఏర్పాటు చేస్తే రూ.1.20 లక్షలు సదరు రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా రైతులకు డబ్బు ఇవ్వకుండానే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తోంది. కొందరికి మాత్రం ఒక స్తంభానికి రూ.5 వేలు చొప్పున ఇస్తోంది. యజమానులు అనుమతి తీసుకోకనే... పేరూరులోని ఈశ్యరయ్యకు చెందిన సర్వే నంబరు 65–3బీలోని ఆరు ఎకరాలు, రామాంజికి చెందిన 64–2బీలో 4.79 ఎకరాలు, తిమ్మక్కకు చెందిన 75–3బీలో 8.33 ఎకరాలు, కేసీ మల్లికార్జునకు చెందిన సర్వే నంబరు 39–2బీ/5బీలో 4 ఎకరాల భూమిలో రైతుల అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలు పాతారు. తమ గోడుని తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కి చెప్పుకున్నా నాయ్యం జరగలేదని బాధితులు వాపోయారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంటోందని, కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని చెబుతున్నారు. ‘రైతులకు అన్యాయం చేస్తున్నారు’ అనుమతి లేకుండా పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు గాలిమరల కంపెనీ అన్యాయం చేస్తోందని బాధిత రైతు కె.సి.మల్లికార్జున, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిన్నపెద్దన్న, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. పొలాలు తమవి కావంటూ విచారణ చేసిన పోలీసు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా తమ భూములు పెద్ద ఆస్తి అని, 1బీ, వెబ్‌ల్యాండ్‌లో కూడా తమ పేరిటే ఉన్నాయన్నారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు కూడా కంపెనీకి అనుకూలంగా వ్యహరిస్తే కేసు కూడా తీసుకోలేదన్నారు. ఇదేమని అడిగితే ఇబ్బంది పెట్టారని, దీంతో మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించామన్నారు. -
సీఎం ఇంటి దారిలో 75 విద్యుత్ స్తంభాలు
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లే దారిలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీతానగరం బకింగ్ హామ్ హెడ్ స్లూయిజ్ నుంచి సీఎం ఇంటి వరకు కరకట్టకు ఆనుకుని దిగువ ప్రాంతంలో 75 స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం కాంక్రీట్ పనులను చేపట్టారు. మొత్తం 1.5 కిలోమీటర్ల పొడవున ఈ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. స్తంభానికి స్తంభానికి మధ్య 30 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇప్పటికే బకింగ్ హామ్ హెడ్ స్లూయిజ్ నుంచి సీఎం నివాసం వరకు 175 విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఉండవల్లి పంచాయతీకి రూ. 40 వేల కరెంటు బిల్లు వస్తోంది. మరలా ఈ 75 లైట్లను కూడా ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లు ఎంత వస్తుందోనని అధికారులు అంటున్నారు. -
అల్లుకున్న నిర్లక్ష్యం
విద్యుత్తు అధికారుల తీరుకు సాక్ష్యం.. నిలువెత్తు ఈ స్తంభం నర్సాపూర్ రూరల్: విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ విద్యుత్తు స్తంభం. నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే గుండం వీరయ్య ఇంటి ఎదుట ఉన్న విద్యుత్తు స్తంభంపై పిచ్చిమొక్కలు ఎగబాకి ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు స్తంభాన్ని అల్లుకోవడంతో అటుగా వెళ్లే చిన్నపిల్లలు, కొత్తగా వచ్చే వ్యక్తులు విద్యుత్తు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ స్తంబానికి వీధిలైట్లతోపాటు పలు ఇండ్లకు విద్యుత్తు సరఫరా చేసే కండక్టర్ వైర్లు ఉన్నాయి. -
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ
విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ లారీ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా కరెంటు పోయింది. రాత్రి నుంచి కరెంటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా శనివారం ఉదయం తెర్లాంలోని పెరుమాళ్ల జంక్షన్ వద్ద కామేశ్వరావు అనే ఏడో తరగతి విద్యార్థి ఓ లారీ కింద పడి చనిపోయాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో డ్రైవర్‌ను పరామర్శిద్దామని మరో లారీలో కొంతమంది వెళ్లారు. పరామర్శించడానికి వెళ్లిన లారీ డ్రైవరే కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి మరో యాక్సిడెంట్ చేశాడు.