క్రమ‘బద్ధకం’!
♦ క్రమబద్ధీకరణపై నీలి నీడలు
♦ గడువు మూడు రోజులే..
ఏకమొత్తంలో చెల్లించినా హక్కులు కల్పించని ప్రభుత్వం స్థలాల రెగ్యులరైజేషన్‌పై స్పష్టత ఇవ్వక, అర్జీదారుల అనుమానాల నివృత్తికి ప్రయత్నం చేయకపోవడంతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఆక్రమణదారులు ముందుకు రావడంలేదు. భూక్రమబద్ధీకరణ గందరగోళంగా మారింది. విధి విధానాలపై గోప్యత పాటిస్తున్న సర్కారు.. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించే గడువు పెంచేదిలేదని స్పష్టం చేయడం దరఖాస్తుదారులను అయోమయంలో పడేసింది. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు స్థలాల్లోని నిర్మాణాల రెగ్యులరైజ్‌కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. క్రమబద్ధీకరణలో బిల్టప్ ఏరియానే పరిగణనలోకి తీసు కోవాలా? ఆక్రమణకు గురైన స్థలాన్ని క్రమబద్ధీకరించాలా? అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతోపాటు యాజమాన్యహక్కులు (కన్వియెన్స్ డీడ్) కల్పించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31నాటికే క్రమబద్ధీకరణ గడువు ముగిసినప్పటికీ, ఈ నెలాఖరు వరకు పొడగించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగు వాయిదాల్లో నిర్దేశిత మొత్తం చెల్లిస్తే స్థలాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని, సంక్రాంతి కానుకగా వీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ప్రభుత్వంపై భరోసాతో జిల్లావ్యాప్తంగా 59 జీఓ కింద 20,203 దరఖాస్తులు వచ్చాయి. (వీటిలో 8,360 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారాయి). వీటిలో ప్రాథమిక స్థాయిలోనే సగానికి పైగా తిరస్కరణకు గురికాగా, 15,139 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించాయి. దీంట్లో 10,452 మాత్రమే క్రమబద్ధీకరణ పరిధిలోకి వస్తాయని తేల్చాయి. క్రమబద్ధీకరణకు అర్హులుగా తేలిన వారందరికీ నిర్ధిష్ట రుసుము చెల్లించాలని నోటీసులు జారీచేశారు. అయితే, పూర్తి మొత్తాన్ని చెల్లించినా యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో మిగతా దరఖాస్తుదారులు డైలమాలో పడ్డారు. దాదాపు 628 మంది ఏకమొత్తంలో (రూ.7.02 కోట్లు) నిర్దేశిత రుసుము కట్టారు. అయినప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో నెలకొన్న సందిగ్ధత కారణంగా వీరికి ఇప్పటివరకు స్థలాలపై హక్కులు రాలేదు. దీంతో ఒకటి, రెండు, మూడు వాయిదాలు కట్టిన దరఖాస్తుదారులు కూడా మిగతా మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు వేశారు.
ఈ క్రమంలోనే 29వ తేదీలోపు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశించడం అర్జీదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు పరిశీలించిన దరఖాస్తుల్లో సుమారు 3వేల వరకు సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. పొరపాటున తప్పుదొర్లితే సవరించేలా సాఫ్ట్‌వేర్‌లో ఆప్షన్ లేకపోవడం కూడా పెండింగ్‌కు కారణమైంది. ఈ వెసులుబాటు కల్పించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు వైబ్‌సైట్‌ను కూడా నిలిపివేయడంతో దరఖాస్తుల క్లియరెన్స్ నిలిచిపోయింది. దీంతో వీటి ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిర్దేశిత మొత్తం చెల్లించడానికి మూడు రోజులే గడువు మిగిలి ఉన్న సమయంలో వీటిపై స్పష్టత ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికితోడు 29లోపు డబ్బులు చెల్లించమని చెబుతున్నారే తప్ప ఆలోపు రిజిస్ట్రేషన్ చేస్తామనే విషయంపై ఇప్పటికీ రెవె న్యూ యంత్రాంగం స్పష్టీకరించడంలేదు. ఇదిలావుండగా, ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌కు ఈ నెలాఖరే ఆఖరు కావడంతో ఆలోపు వీటిపై నిర్ణయం వెలువడకపోతే బీపీఎస్‌కు దరఖాస్తు చేయడం సాధ్యపడదు. వీట న్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.