అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్‌లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్‌ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్‌పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్‌తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్‌ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్‌లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్‌లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం.