రెండో రోజూ ర్యాలీ..
సెన్సెక్స్ 120 పాయింట్లు లాభం
ప్రపంచ ట్రెండ్ అనుకూలించడంతో పాటు అస్సాంలో తొలిసారిగా బీజేపీ అధికారం చేపట్టవచ్చన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో వరుసగా రెండో రోజు మార్కెట్ పెరిగింది. పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ సీట్ల సంఖ్య పెరగవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడిందని విశ్లేషకులు చెప్పారు. దీంతో కీలకమైన సంస్కరణల బిల్లుల్ని కేంద్రం ఆమోదింపచేసుకోగలుగుతుందన్న ఆశలు ఇన్వెస్టర్లలో కలిగాయని బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ అన్నారు.
ఒకదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపినా.. ముగింపులో లాభాల స్వీకరణ కారణంగా 120 పాయింట్ల లాభంతో 25,774 పాయింట్ల వద్ద ముగిసింది. 7,940 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 30 పాయింట్ల లాభంతో 7,891 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆసియా మార్కెట్లయిన హాంకాంగ్, సింగపూర్, జపాన్, తైవాన్ సూచీలు 1.6% వరకూ పెరిగాయి.
పెట్రో కంపెనీల జోరు...
ప్రభుత్వం తాజాగా డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచడంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీలు ఆయిల్ ఇండియా, బీపీసీల్, ఆయిల్ ఇండియా షేర్లు 0.8-3.6% మధ్య పెరిగాయి. అన్నింటికంటే అధికంగా ఓఎన్‌జీసీ 3.72% ఎగిసింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-3.32%మధ్య పెరిగాయి. ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యూనీలీవర్, ఆదాని పోర్ట్స్ షేర్లు 1-2%మధ్య క్షీణించాయి.
సన్‌టీవీ అదుర్స్...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ల్లో డీఎంకే మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోవచ్చన్న అంచనాల్ని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించడంతో సన్‌టీవీ షేరు దూసుకుపోయింది. 10 %పెరిగిన ఈ షేరు 52 వారాల గరిష్టస్థాయి రూ. 431.65 వద్ద ముగిసింది. సన్‌టీవీ అధినేత కళానిధి మారన్...డీఎంకే చీఫ్ కరుణానిధికి సమీప బంధువు, సన్నిహితుడుకావడంతో ఆ పార్టీ అధికారంలోకి వస్తే సన్‌టీవీ నెట్‌వర్క్ మరింత విస్తరించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలుచేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.