మార్కెట్ మరో కొత్త రికార్డ్ | Sensex back in green after slipping over 100 pts; top bets | Sakshi
Sakshi News home page

మార్కెట్ మరో కొత్త రికార్డ్

Published Sat, Jul 5 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

మార్కెట్ మరో కొత్త రికార్డ్

మార్కెట్ మరో కొత్త రికార్డ్

వర్షాలు ఆలస్యమైనప్పటికీ ద్రవ్యోల్బణంపై ఆందోళనలు అక్కర్లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన అభయంతో స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులను సాధించాయి. అమెరికా సూచీ  డోజోన్స్ 17,000 పాయింట్లను అధిగమించడం, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు బాగా దిగిరావడం కూడా ఇందుకు దోహదపడింది. వెరసి సెన్సెక్స్ 138పాయింట్లు పుంజుకుని 25,962 వద్ద ముగిసింది.

 ఇక నిఫ్టీ కూడా 37 పాయింట్లు బలపడి 7,752 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా, ఒక దశలో సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా నష్టపోయింది. కనిష్టంగా 25,659ను తాకింది.తగిన స్థాయిలో నిల్వ ఉంచిన ఆహారోత్పత్తుల విడుదల ద్వారా ధరలు పెరగకుండా చూస్తామని జైట్లీ వ్యాఖ్యానించడంతో చివర్లో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా బ్లాక్‌మార్కెటీర్లపై తగిన చర్యలను చేపట్టనున్నట్లు జైట్లీ తెలియజేయడం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 111 డాలర్ల దిగువకు చేరడం వంటి అంశాలు కూడా దీనికి బలాన్ని చేకూర్చాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడటం విశేషం!

 ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
 నాలుగు రోజుల్లో రూ. 4,400 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా రూ. 943 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీ సంస్థలు రూ. 853 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ప్రధానంగా ఆయిల్, రియల్టీ రంగాలు 1%పైగా లాభపడ్డాయి.

 కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచే ప్రతిపాదనలపై ఆయిల్ శాఖ నిపుణుల కమిటీని నియమించనుందన్న వార్తలతో చమురు, గ్యాస్ షేర్లు వెలుగులో నిలిచినట్లు విశ్లేషకులు తెలిపారు. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, ఆర్‌ఐఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ 4-1% మధ్య పురోగమించాయి. సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.3%, డాక్టర్ రెడ్డీస్ 1.6% చొప్పున లాభపడగా, సెసాస్టెరిలైట్, విప్రో 1.5% స్థాయిలో నష్టపోయాయి.

 చిన్న షేర్లు ఓకే
 మార్కెట్లకు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5%పైగా లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడితే, 1,357 నష్టపోయాయి. కంపెనీ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 990 కోట్ల ప్యాకేజీని ఇవ్వనుందన్న వార్తలతో ఫ్యాక్ట్ షేరు 5% ఎగసింది. మిడ్ క్యాప్స్‌లో హిందుజా గ్లోబల్ 20% దూసుకెళ్లగా, యునెటైడ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్, పొలారిస్, కాక్స్‌అండ్‌కింగ్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, కార్బొరేండమ్, ఇక్రా, ట్రీహౌస్, మహీంద్రా సీఐఈ, పీసీ జ్యువెలరీ, రోల్టా, కేపీఐటీ కమిన్స్ 13-6% మధ్య జంప్‌చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement