ముంబై: జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో సోమవారం స్టాక్ సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 364 పాయింట్లు ర్యాలీ చేసి 52,951 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 15,885 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు జూలైలో ఊపందుకోవడంతో రియల్టీ రంగ కౌంటర్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఆటో కంపెనీలు జూలైలో వాహన విక్రయాల్లో రెండింతల వృద్ధిని సాధించడంతో ఈ రంగానికి చెందిన షేర్లు ఐదుశాతానికి పైగా రాణించాయి.
చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 52,901 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 15,875 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్లో నెలకొన్న సానుకూలతలతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లను ఆర్జించగలిగింది. మిడ్‌సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడితో సూచీలు కొంత నీరసపడ్డాయి. అయితే మళ్ళీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోల్పోయిన లాభాల్ని తిరిగి ఆర్జించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1540 కోట్ల షేర్లను అమ్మగా., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1506 కోట్ల షేర్లను కొన్నారు.
దేశీయంగా సానుకూలతలు...
తొలి త్రైమాసికానికి సంబంధించి ఇటీవల కంపెనీలు ప్రకటించిన ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. జీఎస్టీ వసూళ్లు జూలైలో మళ్లీ రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ ఏడాది జూన్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 8.9 శాతం వృద్ధిని నమోదుచేసింది. దేశీయ తయారీ రంగం మూడునెలల తర్వాత జూలైలో సానుకూల వృద్ధి రేటును సాధించింది. స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా నమోదుకావడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ అవుతుందనే ఆశలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించాయి.
పటిష్టంగా ప్రపంచ మార్కెట్లు
మౌలిక రంగ బలోపేతానికి లక్ష కోట్ల డాలర్లను వెచ్చించే బిల్లుకు యూఎస్ సెనెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలోనే లాభాల బాటపట్టాయి. గతవారంలో భారీగా పడిన ఆసియా మార్కెట్లు సోమవారం రికవరీ బాటపట్టాయి. జపాన్, చైనాల స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. హాంగ్‌కాంగ్, తైవాన్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం పెరిగాయి. కొరియా, ఇండోనేషియా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూరప్‌లోని ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ సూచీలు ఒకటి నుంచి అరశాతం పెరిగాయి. అమెరికా ఫ్యూచర్లు పటిష్ట లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment