ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొన్ని రోజులుగా సందడి చేసిన బుల్ వారాంతపు రోజైన శుక్రవారం చతికిలపడింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 652 పాయింట్లు నష్టపోయి 60వేల దిగువన 59,646 వద్ద స్థిరపడింది. ఈ సూచీలో 30 షేర్లలో ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించి 17,758 వద్ద నిలిచింది. దీంతో సెన్సెక్స్ అయిదు, నిఫ్టీ ఎనిమిది రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది.
బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,111 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,633 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీలు ఒక శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.277.58 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రికవరీతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 79.44 వద్ద స్థిరపడింది.
లాభాలతో మొదలై నష్టాల్లోకి: దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 823 పాయింట్లు పతనమై 60,298 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 17,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
కేంద్రం డీజిల్‌పై ఎగుమతి విండ్‌ఫాల్ లాభాల పన్నును రూ.5 నుంచి రూ.7కు పెంచడంతో రిలయన్స్ షేరు రెండుశాతం నష్టపోయి రూ.2,614 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీల పతనానికి కారణమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, బజాబ్ ఫిన్‌సర్వ్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయాయి.
నష్టాలు ఎందుకంటే
జూన్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 18% ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరి ష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది. యూఎస్ ఫెడ్ రిజ ర్వ్ మినిట్స్, నిరుద్యోగ డేటా వెల్లడి తర్వాత కీలక వడ్డీరేట్ల పెంపు భయాలు మరో సారి తెరపైకి రావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా 13 ట్రేడింగ్ సెషన్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు గురువారం అనూహ్యంగా రూ.1,706 కోట్ల షేర్లు అమ్మేశారు.
చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment