ముంబై: గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు, ఇన్వెస్టర్ల మూకుమ్మడి కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. వెరసి మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ క్యూ3 ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐటీ కౌంటర్లకు డిమాండ్ పుట్టింది. ముందురోజు నాస్‌డాక్ (యూఎస్) జోరందుకోవడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. సెన్సెక్స్ 847 పాయింట్లు జంప్ చేసింది. 60,747 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 242 పాయింట్లు ఎగసి 18,101 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 989 పాయింట్లు దూసుకెళ్లి 60,889ను తాకింది. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో సానుకూల ట్రెండ్ నెలకొంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వేతన వృద్ధి మందగించడం, సర్వీసుల రంగం బలహీనపడటంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగానికి కళ్లెం పడనున్నట్లు అంచనాలు పెరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 31 పైసలు బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 82.35 వద్ద ముగిసింది.
మూడు మాత్రమే
ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌లో మూడు కౌంటర్లు మాత్రమే డీలా పడ్డాయి. ప్రధానంగా హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ వెనకడుగు వేశాయి. టెక్నాలజీ, ఐటీ 2.6 శాతం జంప్‌చేయగా.. పవర్, మెటల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఇండస్ట్రియల్స్ 1.8–1.2 శాతం మధ్య ఎగశాయి. కేవలం కన్జూమర్ డ్యురబుల్స్ నీరసించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, సాŠమ్ల్ క్యాప్ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. గత వారం దిద్దుబాటు తదుపరి గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ట్రెండ్ దన్నుతో ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
చదవండి: నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment