ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, కొత్త తరం కంపెనీల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 498 పాయింట్లు నష్టపోయి 55,268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 147 పాయింట్లు క్షీణించి 16,500 దిగువున 16,484 వద్ద నిలిచింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
బీఎస్‌ఈలోని మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,548 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నేటి (బుధవారం) రాత్రి ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ.., జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలతో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 563 పాయింట్లు క్షీణించి 55,203 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పతనమైన 16,631 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► జొమాటో షేర్ల పతనం కొనసాగింది. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 13% పతనమై రూ.41.25 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సరికి 12.41% నష్టంతో రూ.41.65 వద్ద నిలిచింది.
► 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం ప్రారంభమవడంతో టెలికం రంగ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఎయిర్‌టెల్ షేరు ఒకశాతం లాభపడగా, వొడాఫోన్ ఐడియా షేరు 1% నష్టపోయింది. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎలాంటి లాభ నష్టం లేకుండా ఫ్లాట్‌గా రూ. 2,420 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రం వేలం నేటితో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment