ముంబై: ఇంధన, ఆటో, టెలికం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బుల్స్ ఆరురోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మూడుశాతానికి పైగా క్షీణించి స్టాక్ సూచీల పతనాన్ని శాసించింది. సెన్సెక్స్ 306 పాయింట్ల తగ్గుదలతో 56వేల దిగువన 55,766 వద్ద స్థిరపడింది. ఈ సూచీ కోల్పోయిన మొత్తం పాయింట్లలో ఒక్క రిలయన్స్ షేరు వాటాయే 252 పాయింట్లు కావడం గమనార్హం. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16,631 వద్ద నిలిచింది. మరోవైపు మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.845 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.72 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేపు (బుధవారం) ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు నీరసంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గడచిన ఆరు సెషన్ల నుంచి సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలి సెషన్‌లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 535 పాయింట్లు క్షీణించి 55,537 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 16,564 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి మెటల్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీలు కొంతమేర నష్టాలను తగ్గించుకోగలిగాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు మూడు శాతం క్షీణించి రూ.2,420 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 4% పతనమై రూ.2,404 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ రూ.55,981 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ఎక్సే్ఛంజీలో 4.66 లక్షల షేర్లు చేతులు మారాయి.
► ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల ఏడాది లాక్–ఇన్ పీరియడ్ గడువు(జూలై 23న) ముగియడంతో జొమాటో షేరు భారీ పతనాన్ని చవిచూసింది. 14%కి పైగా క్షీణించి రూ.46 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.47.55 వద్ద నిలిచింది.
►క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఇన్ఫీ షేరుకు డిమాండ్ కరువైంది. అరశాతం క్షీణించి రూ.1,502 వద్ద నిలిచింది.
చదవండి: Income Tax Day 2022: రూ.14 లక్షల కోట్లు వసూళ్లు చేశాం: నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment