బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ! | Banks Stock Performance | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ!

Published Wed, Apr 6 2022 8:22 AM | Last Updated on Wed, Apr 6 2022 8:23 AM

Banks Stock Performance  - Sakshi

ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టంతో ముగిసింది. పెరిగిన క్రూడాయిల్‌ ధరలతో ద్రవ్యోల్బణ ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మెగా విలీన ప్రకటనతో సోమవారం ట్రేడింగ్‌లో భారీగా ర్యాలీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు మూడు శాతం క్షీణించి రూ.1607 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ షేరు రెండు శాతం పతనమై రూ.2,622 వద్ద ముగిశాయి. వీటితో పాటు రిలయన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. అధిక వెయిటేజీ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 435 పాయింట్లు నష్టపోయి 60,177 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 18వేల దిగువున 17,957 వద్ద నిలిచింది. దీంతో సూచీల రెండురోజుల ర్యాలీకి బ్రేక్‌ పడినట్లైంది. మరోవైపు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఇంధన రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.375 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.105 కోట్లను కొన్నారు. 

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, తిరిగి పెరిగిన క్రూడాయిల్‌ ధరలతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్‌ మార్కెట్లు పనిచేయలేదు. థాయ్‌లాండ్‌ సూచీ స్వల్పంగా నష్టపోయింది. ఇండోనేíసియా, జపాన్‌ సింగపూర్‌ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ మార్కెట్‌ ఒకటిన్నర శాతం, జర్మనీ స్టాక్‌ సూచీ అరశాతం, బ్రిటన్‌ మార్కెట్‌ 0.10 పావుశాతం నష్టపోయాయి. 

ఇంట్రాడే కనిష్టం వద్ద ముగింపు 
స్టాక్‌ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 60,786 వద్ద, నిఫ్టీ పాయింట్లు పెరిగి 18,081 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, ఆర్‌బీఐ సమావేశం ఆరంభ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అమ్మకాలు సూచీల పతనాన్ని శాసించాయి. మిడ్‌సెషన్‌లో యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 545 పాయింట్లు క్షీణించి 60,067 స్థాయికి, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,921 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. 

‘‘గత 5–6 నెలల కన్సాలిడేషన్‌ తర్వాత మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అందుకే లార్జ్‌క్యాప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనా.., చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణ తదితర పరిణామాలను విస్తృతస్థాయి మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసుకుంది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల ర్యాలీ మరింత కొంతకాలం కొనసాగవచ్చు’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు 
 

మార్కెట్లో మరిన్ని సంగతులు 

►రెస్టారెంట్‌ భాగస్వాములతో (ఆర్‌పీ) వ్యాపార లావాదేవీల్లో అనుచిత విధానాలకు పాల్పడుతున్న అభియోగాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో జొమాటో షేరు 3% నష్టపోయి రూ.83.85 వద్ద స్థిరపడింది. 

► పేమెంట్స్‌ కెనడాతో వ్యూహాత్మక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో టీసీఎస్‌ షేరు ఇంట్రాడేలో 2% పెరిగి రూ.3,836 వద్ద ఆరువారాల గరిష్టాన్ని తాకింది. చివరికి ఒకశాతం నష్టంతో రూ.3,814 వద్ద స్థిరపడింది. 

► దివాళా పరిష్కార చట్టం కింద ఎస్సార్‌ పవర్‌ ఎంపీ సంస్థ చేజిక్కించుకోవడంతో అదానీ పవర్‌ షేరు పదిశాతం పెరిగి రూ.232 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement