Petrol price incresed
-
పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన ఎక్సైజ్ సుంకాలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరుతోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం 79 శాతం పెరిగినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గల్లా పెట్టే గలగల కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వద్ద అందుబాటులోని సమాచారాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎక్సైజ్ సుంకాల రూపంలో ఆదాయం రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అంటే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం అధికంగా సమకూరింది. ఇక కరోనా రావడానికి ముందు 2019లో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.95,930 కోట్లుగానే ఉంది. ఎక్సైజ్ సుంకమే కీలకం గతేడాది కరోనా వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు గణనీయంగా పడిపోవడం తెలిసిందే. ఆ సమయంలో ఆదాయంలో లోటు సర్దుబాటు కోసం కేంద్ర సర్కారు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను పెంచేసింది. ఆ తర్వాత పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టాలకు చేరినప్పటికీ.. పూర్వపు సుంకాలనే కొనసాగిస్తుండడం గణనీయమైన ఆదాయానికి తోడ్పడుతోంది. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ వసూళ్లు రూ.3.89 లక్షల కోట్లు కాగా, 2019–20లో ఈ మొత్తం రూ.2.39 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజ వాయువులపైనే విధిస్తున్నారు. చదవండి:పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు -
దేశంలో పరుగులు పెడుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు
సాక్షి,వెబ్‌డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. జూన్ నెలలో పదో సారి ఇందన రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆయిల్ రిటైలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర రూ. 96.93 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ.87.69 వద్ద కొనసాగుతుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.08 ఉండగా.. డీజిల్ ధర రూ.95.14కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.14 ఉండగా..డీజిల్ రూ. 92.31 కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.84 గా ఉంటే లీటర్ డీజిల్ రూ. 90.54కు చేరింది. ఇక భోపాల్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.13 ఉండగా డీజిల్ ధర రూ. 96.35 వద్ద ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.17 ఉండగా డీజిల్ రూ. 92.97 వద్ద అమ్ముడవుతోంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 108.07 ఉండగా డీజిల్ ధర.100.82 గా ఉంది. ఇక మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీకి చేరాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,లడఖ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కు చేరింది. కాగా,హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.74, డీజిల్ రూ.95.59, విజయవాడలో పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.96.97 కు చేరింది. చదవండి: అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ? -
బండి బాదుడు
వాహన యజమానులపై మళ్లీ పెట్రో పోటు జిల్లా వాసులపు నెలకు రూ.34.60 కోట్ల అదనపు భారం సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నిన్న మొన్నటివరకు ధరలను పైసల్లో తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా రూపాయల్లో పెంచేసింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.07, డీజిల్‌పై రూ.1.90 పెంపుదల చేస్తూ.. పెరిగిన ధరలు బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజాగా పెంచిన ధరలకు వ్యాట్ ట్యాక్స్ కలిపితే పెట్రోల్ ధర రూ.3.52, డీజిల్ ధర రూ.2.12 చొప్పున పెరుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ ధర రూ.62.12 పైసలు, డీజిల్ రూ.52.28 పైసలుగా ఉంది. తాజా పెంపు ధరతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెట్రోలు ధర రూ.65.64, డీజిల్ ధర రూ.54.40 పైసలు అవుతుందని ఏలూరులోని ఓ పెట్రోలు బంకు యజమాని సీతారామాంజనేయులు చెప్పారు. రూ.34.60 కోట్ల భారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో జిల్లాపై నెలకు రూ.34.60 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీ, ఇతర ఆయిల్ కంపెనీలకు సంబంధించి 400 వరకు బంక్‌లు ఉన్నాయి. సగటున ఒక్కో బంక్‌లో రోజుకు పెట్రోల్ 3 వేల లీటర్లు, డీజిల్ 8వేల లీటర్లు విక్రయిస్తుంటారని అంచనా. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 12 లక్షల లీటర్ల పెట్రోల్, 32 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.47.64 లక్షలు, నెలకు రూ.14.29 కోట్ల మేర అదనపు భారం పడనుంది. డీజిల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.67.84 లక్షలు, నెలకు రూ.20.35 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రవాణా శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 8,870 లారీలు, ట్రక్ ఆటోలు 12,415, స్కూల్ బస్‌లు 1,832, ట్రాక్టర్లు 5,450, 42 వేల ఆటోలు ఉన్నాయి. వీటికితోడు చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి చెరువులకు, మోటార్ పంపుసెట్లుకు డీజిల్ అవసరం. ఆర్టీసీపైనా భారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా రంగంతోపాటు ఏపీ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పైనా అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో 673 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటికి రోజుకు 35 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీపైనే రోజుకు సుమారు రూ.81 వేల ఆర్థిక భారం పడుతుంది. నెలకు రూ.24.36 లక్షల భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఇది అదనపు భారంగా పరిణమించనుంది.