బండి బాదుడు
వాహన యజమానులపై మళ్లీ పెట్రో పోటు
జిల్లా వాసులపు నెలకు రూ.34.60 కోట్ల అదనపు భారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నిన్న మొన్నటివరకు ధరలను పైసల్లో తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా రూపాయల్లో పెంచేసింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.07, డీజిల్‌పై రూ.1.90 పెంపుదల చేస్తూ.. పెరిగిన ధరలు బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజాగా పెంచిన ధరలకు వ్యాట్ ట్యాక్స్ కలిపితే పెట్రోల్ ధర రూ.3.52, డీజిల్ ధర రూ.2.12 చొప్పున పెరుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ ధర రూ.62.12 పైసలు, డీజిల్ రూ.52.28 పైసలుగా ఉంది. తాజా పెంపు ధరతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెట్రోలు ధర రూ.65.64, డీజిల్ ధర రూ.54.40 పైసలు అవుతుందని ఏలూరులోని ఓ పెట్రోలు బంకు యజమాని సీతారామాంజనేయులు చెప్పారు.
రూ.34.60 కోట్ల భారం
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో జిల్లాపై నెలకు రూ.34.60 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీసీ, బీపీసీ, ఐఓసీ, ఇతర ఆయిల్ కంపెనీలకు సంబంధించి 400 వరకు బంక్‌లు ఉన్నాయి. సగటున ఒక్కో బంక్‌లో రోజుకు పెట్రోల్ 3 వేల లీటర్లు, డీజిల్ 8వేల లీటర్లు విక్రయిస్తుంటారని అంచనా. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 12 లక్షల లీటర్ల పెట్రోల్, 32 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.47.64 లక్షలు, నెలకు రూ.14.29 కోట్ల మేర అదనపు భారం పడనుంది. డీజిల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.67.84 లక్షలు, నెలకు రూ.20.35 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రవాణా శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 8,870 లారీలు, ట్రక్ ఆటోలు 12,415, స్కూల్ బస్‌లు 1,832, ట్రాక్టర్లు 5,450, 42 వేల ఆటోలు ఉన్నాయి. వీటికితోడు చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి చెరువులకు, మోటార్ పంపుసెట్లుకు డీజిల్ అవసరం.
ఆర్టీసీపైనా భారం
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా రంగంతోపాటు ఏపీ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పైనా అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో 673 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటికి రోజుకు 35 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీపైనే రోజుకు సుమారు రూ.81 వేల ఆర్థిక భారం పడుతుంది. నెలకు రూ.24.36 లక్షల భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఇది అదనపు భారంగా పరిణమించనుంది.