న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ ప్రథమార్ధంలో డీజిల్ వినియోగం 4 శాతం క్షీణించింది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వేడి వాతావరణ పరిస్థితులు రవాణాపై ప్రభావం చూపించడం వల్లే వినియోగం తగ్గినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరుణంలో ఇంధన విక్రయాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఎన్నికల సమయంలో వినియోగం నెలవారీగా క్షీణిస్తూ వచి్చంది. ఎన్నికలు ముగిసిన మరుసటి నెలలోనూ వినియోగం తగ్గడం వాతావరణ పరిస్థితుల వల్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జూన్ 1 నుంచి 15 మధ్య 3.95 మిలియన్ టన్నుల డీజిల్ విక్రయాలు నమోదైనట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 3.9 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో 2.7 శాతం, ఏప్రిల్‌లో 2.3 శాతం, మే నెలలో 1.1 శాతం చొప్పున డీజిల్ విక్రయాలు క్షీణించాయి. ఇక జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.42 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలోనూ 1.41 మిలియన్ టన్నుల విక్రయాలే జరిగాయి. మే నెల మొదటి అర్ధ భాగంలోని విక్రయాలతో పోల్చి చూస్తే అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. వేసవిలో అధిక వేడి నుంచి ఉపశమనం కోసం కార్లలో ఏసీ వినియోగం పెరుగుతుంది. ఇది అధిక ఇంధన వినియోగానికి దారితీస్తుంది. అయినా కానీ, ఈ వేసవిలో ఇంధన అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2 చొప్పున ప్రభుత్వరంగ సంస్థలు తగ్గించడం కూడా అమ్మకాలకు ప్రేరణనివ్వలేదని తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ వినియోగం రవాణా రంగంలోనే నమోదవుతుంటుంది.
పెరిగిన ఏటీఎఫ్ అమ్మకాలు...
ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు ఈ నెల మొదటి 15 రోజుల్లో 2.3 శాతం పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు) 3,31,000 టన్నలుగా ఉన్నాయి. మే నెల మొదటి 15 రోజులతో పోల్చి చూస్తే 4.5 శాతం తక్కువ. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వినియోగం కరోనా ముందునాటి స్థాయిని దాటిపోవడం గమనార్హం. వంటగ్యాస్ వినియోగం (ఎల్‌పీజీ) పెద్దగా మార్పు లేకుండా 1.24 మిలియన్ టన్నులుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment