petrolling
-
సూపర్ ఉమెన్.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్ ప్రశంసలు..
సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..? చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్ కమిషనర్ ఆర్వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్ టాపిక్ మారింది. ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్ స్పందించారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓ ఇంట్లో చోరి చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన దొంగ.. తీరాచూస్తే..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఓ పాత నేరస్థుడిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్‌ఏకే జిలానీ తెలిపిన వివరాలు.. తార్నాకకు చెందిన కిశోర్ (34) ఓవైసీ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండడంతో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ ఉప్పుగూడ శివాజీనగర్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బస్తీలోని ఓ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కిశోర్‌ను పోలీసులు ప్రశ్నించడంతో తడబడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు అంగీకరించాడు. ఇతడు గతంలో కూడా సెల్‌ఫోన్ దొంగతనంతో పాటు మరో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
పోలీసు పెట్రోలింగ్ వాహనానికి ప్రమాదం
సాక్షి, చిత్తూరు : పోలీస్ పెట్రోలింగ్ వాహనానికి ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి - తిరుపతి మార్గంలో ఏర్పేడు మండలం సీతారాంపేట గ్రామ సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ కులశేఖర్, కానిస్టేబుల్ మునిరెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగినందుకే..
సాక్షి, నిజామాబాద్ : పెట్రోలింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసులు దాడికి పాల్పడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు మేరకు...దుర్గా ప్రసాద్ వ్యక్తి బాన్సువాడ మండలం కోయగుట్ట గురుకుల పాఠశాలలో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో రుద్రూరు సమీపంలోని రైస్‌మిల్లు వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో తమకు ఎదురుపడిన దుర్గాప్రసాద్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు దుర్గాప్రసాద్ పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లి బూటు కాళ్లతో తన్నారు. అనంతరం బోధన్ ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీపీ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. దాడి చేసిన వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధితుడు తాగి పడిపోవడంతోనే గాయాలపాలయ్యాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
వంద క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
జనగామ : జనగామ మీదుగా నిజామాబాద్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పట్టణ రెండో ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తుండగా డీసీఎంలో తరలుతున్న పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహన డ్రైవర్ షేక్ రజాక్‌ను అదుపులోకి తీసుకుని, సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చారు. సివిల్ సప్లయ్ విజిలెన్స్ సీఐ రమణారెడ్డి చేరుకుని డీసీఎం యజమాని గఫార్‌ను ఫోన్లో విచారించగా ఈ బియ్యం దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన డీలర్ బుక్క వెంకన్నకు చెందినవిగా తేలింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయనతో ఎస్సై సంతోషం రవీందర్, ఏఎస్ఓ రోజారాణి, డీటీ రమేష్, ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ ఉన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీ 16.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ పెద్దమడూరు(దేవరుప్పుల) : మండలంలోని పెద్దమడూరులో రేషన్‌షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి ఓ వాహనంలో 100 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని తరలిస్తుండగా జనగామలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు పట్టుకొని విచారించగా బ్లాక్‌దందా వెలుగులోకి వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం పెద్దమడూరులో అధికారులు తనిఖీలు చేయగా ఓ ఇంట్లో 16.50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్థానిక డీలరు బుక్కా వెంకన్న డంప్ చేసినట్లు తేలింది. ఈ విషయమై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ జనగామలో తాము పట్టుకున్న వంద క్వింటాళ్లతోపాటు ఇక్కడ దొరికిన 16.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం డీలరు బుక్కా వెంకన్నవిగా గుర్తించామని, శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు. దాడుల్లో సివిల్ సప్లయ్ డీటీ గాదెం రమేష్, ఎఎస్‌ఓ రోజారాణి, హరిప్రసాద్, సురేష్, ఏఆర్ఐ భద్రయ్య, వీఆర్ఓ రెహమాన్ తదితరులు ఉన్నారు.