అరకొర భక్తులతో వెలవెల
కళతప్పిన పెనుమూడి ఘాట్
భక్తుల సంఖ్య కన్నా అధికారుల సంఖ్యే ఎక్కువ
రేపల్లె: పుష్కరాల సందర్భంగా మండలంలో ఎనిమిది పుష్కరఘాట్లలో ఐదో రోజు మంగళవారం పెనుమూడి, మోర్తోట పుష్కరఘాట్లలో నామమాత్రంగా తరలి వచ్చారు. దీంతో ఆ యా ఘాట్లు వెలవెలపోయాయి. మిగిలిన రావిఅనంతవరం, పెనుమూడి వీఐపీ, మైనేనివారిపాలెం, గంగడిపాలెం, చెన్నుపల్లివారిపాలెం, రాజుకాల్వ పుష్కరఘాట్లలో నామమాత్రంగా కూడా భక్తులు కనిపించలేదు. ఘాట్లలో భక్తుల సంఖ్య కన్నా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బం దితో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అధిక శాతం లో కనిపించారు. దీంతో ఘాట్లు బోసిపోతున్నాయి. శ్రావణ మంగళవారం కావటంతో పితృదేవతలకు తర్పణాలు వదిలేం దుకు భక్తులు ఆసక్తి చూపరని, దీంతో భక్తుల సంఖ్య కనిపించలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.
మహిళల ప్రత్యేక పూజలు..
కృష్ణా పుష్కరాలలో భాగంగా 5వరోజు మండలంలోని మోర్తోట, పెనుమూడి పుష్కరఘాట్ల వద్ద మహిళలు పుణ్యస్నానాలను ఆచరించారు. పసుపు, కుంకుమ, పువ్వులను సమర్పించి నమస్కారాలు చేశారు.