రిమ్స్ సిగలో మరో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, కడప:
నాటి మొక్క వటవృక్షమైంది. వెనుకబడిన ప్రాంతాల్లో అత్యున్నత విద్య అందించాలనే సంకల్పం నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు సాకారమయ్యాయి. రిమ్స్ శిగలో మరో కలికితురాయి మెరిసింది. తొలి బ్యాచ్ పీజీలు పాస్ అయ్యారు. గురువారం వెల్లడైన ఫలితాలతో 12మందికి ఎండీ డిగ్రీలు అందనున్నాయి. రిమ్స్ మెడికల్ కళాశాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యం జిల్లా ప్రజల ముంగిట ఉండాలని ఆకాంక్షించారు. ఆ మేరకు రిమ్స్‌కు కావాల్సిన వసతులు, పరికరాలను సమకూర్చారు. తొలుత విధుల్లో చేరేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో వైద్యులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇలా ఎప్పటికప్పుడు కంటిపాపలా రిమ్స్‌ను కాపాడుకుంటూ దినదినాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
వైఎస్ఆర్ మరణానంతరం పాలకుల వివక్ష స్పష్టంగా కన్పిస్తూ వచ్చిందని విశ్లేషకుల భావన. అది అటుంచితే నాడు సదుద్దేశంతో నాటిన విత్తు నేడు మహావృక్షంగా వమారింది. ఎంతో మంది రోగులకు వైద్యసేవలు అందిస్తూనే భావి వైద్యులుగా తీర్చిదిద్దుతూ అత్యున్నత డీగ్రీలను అప్పగిస్తోంది.
12 మంది పీజీలు పాస్....
రిమ్స్ మెడికల్ పీజీలు 12 మంది పాస్ అయ్యారు. గురువారం ఫలితాలు వెల్లడికావడంతో మెడికల్ విద్యార్థులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. సీనియర్లుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ, కలుపుగోలుగా వెళ్లే పీజీ వైద్యులు పాస్ అయ్యారని తెలుసుకొని హర్షం వ్యక్తం చేయసాగారు. జనరల్ మెడిసన్ పీజీలు ముగ్గురు, సర్జన్ పీజీలు ముగ్గురు, డెర్మటాలజీ పీజీలు ఇద్దరు, ఆఫ్తల్ పీజీలు ఇద్దరు, గైనిక్, అనస్తీషీయా ఒక్కక్కరు చొప్పున 12 మంది పాస్ అయ్యారు. 13 మంది పరీక్షలు రాయగా 12 మంది పాస్ అయ్యారు. కాగా కడప గడపలో ఎండీ డీగ్రీలు పొందడం ఇదే తొలిసారిగా చరిత్రకెక్కనుంది. పాలకుల వివక్షను రిమ్స్ ఓ వైపు చవి చూస్తూనే మరోవైపు మేటి వైద్య కళాశాలలకు దీటుగా నిలుస్తోంది. విద్యార్థులు సంతోషంగా ఉండగా శుక్రవారం వైద్యవిద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ యాదృ చ్ఛికంగా రిమ్స్‌లో బస చేసేందుకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా కావాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.