మెడికల్ పీజీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: శనివారం నుంచి మెడికల్, డెంటల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా పరీక్షలను యథావిధిగా ప్రారంభించేందుకు అనుమతి ఇస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 29 వరకూ పరీక్షలను నిర్వహించేందుకు ఎంఐసీ అనుమతి ఇచి్చందని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కూడా వైద్యపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందున అనుమతి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచి్చంది.
ఈ ఫీజుతోనే సప్లిమెంటరీ పరీక్షలకు..
గాంధీ ఆస్పత్రిని కరోనా వైద్యానికి కేటాయించినందున ఆ ఆస్పత్రిలో పరీక్షలు రాయాల్సిన 158 మందికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభాకర్ రావు ధర్మాసనానికి తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం గడువులోగా పరీక్షలను నిర్వహించాలని కోర్టు విచారణకు హాజరైన కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. కరోనా కారణంగా ఏడాదికి ప్రాక్టికల్స్‌ను ల్యాబ్స్‌కు పరిమితం చేసేందుకు కౌన్సిల్ అనుమతి ఇచ్చిందని, రోగుల వద్ద ప్రాక్టికల్స్ ఉండవని చెప్పారు. కరోనా కారణంగా పరీక్షలు రాయరాదని భావించే విద్యార్థులకు కరోనా సమస్య పరిష్కారం అయ్యాక సప్లిమెంటరీ నిర్వహించేందుకు అనుమతి ఉంటుందన్నారు. సప్లిమెంటరీ రాయాలని భావించే విద్యార్థుల నుంచి వేరే ఫీజు వసూలు చేయవద్దని, ఇప్పుడు వసూలు చేసిన ఫీజుతోనే పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
నేటి నుంచి పరీక్షలు
పీజీ మెడికల్ డిగ్రీ డిప్లొమా పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20, 22, 24వ తేదీల్లో పీజీ డిప్లొమా, 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్షాకేంద్రంలో రిపోర్ట్ చేయాలని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను ఎల్బీనగర్లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించినట్లు తెలిపారు. మొత్తం 1,187 మంది పరీక్షలు రాస్తున్నారని, ఇందులో 994 పీజీ డిగ్రీ అభ్యర్థులు, 193 పీజీ డిప్లొమా అభ్యర్థులున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పెద్ద లెక్చర్ హాల్స్, ఎగ్జామ్ హాల్స్‌లో 25 నుంచి 30 మంది విద్యార్థులకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటిస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్లు కనీ్వనర్ వెల్లడించారు.