వైద్యం చేయాలంటే పరీక్ష పాసవ్వాలి
- సీఈటీ నిర్వహించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన
- పీజీ, ఎంబీబీఎస్ వారైనా పరీక్ష రాశాక వైద్యం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రోగికి చికిత్స చేయాలంటే ఎంబీబీఎస్ లేదా పీజీ వైద్య పరీక్షలు పాసైన మాత్రాన నేరుగా వైద్యం చేసే అవకాశం ఇవ్వకూడదని, అర్హత పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య-చికిత్సా విధానాలు తదితర అంశాలపై 126 పేజీల నివేదిక ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించిన విధానాల్లో.. ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ ఇలా ఎవరైనా ఆ కోర్సు నుంచి పాసై బయటకు వచి ప్రాక్టీస్ (రోగులకు వైద్యం) చేయాలంటే కామన్ ఎగ్జిట్ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 400 మెడికల్ కళాశాలలున్నాయి. అందులో 55 వేల ఎంబీబీఎస్ సీట్లుంటే కనీసం 45 వేల మంది గ్రాడ్యుయేట్లు ఏటా కోర్సు పూర్తి చేసుకుంటున్నారు.
అలాగే 25 వేల మంది పీజీ వైద్యులు కోర్సుపూర్తి చేసుకుని వస్తున్నారు. వీళ్లందరు ఎలాంటి టెస్టూ, నిబంధన లేకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నాణ్యమైన వైద్యానికి తిలోదకాలు ఇచ్చినట్టవుతోందని కమిటీ అభిప్రాయపడింది. కామన్ ఎగ్జిట్ పరీక్ష కూడా అత్యంత కష్టంగా, క్లిష్టంగా ఉండాల్సిన పనిలేదని, కనీసం ప్రాథమిక వైద్యం ఎలా చేయాలో చెప్పే పరీక్ష అయితే సరిపోతుందని చెప్పింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో తుది సంవత్సర పరీక్ష అయిపోగానే కామన్ ఎగ్జిట్ పరీక్ష పెట్టాలని కమిటీ నొక్కిచెప్పింది. అయితే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా చాలా కళాశాలలు ఒప్పుకోవడం లేదని కూడా కమిటీ చెప్పింది.