పీజీ మెడికల్ ప్రాక్టికల్స్‌లో ఆడియో రికార్డింగ్
విజయవాడ, న్యూస్‌లైన్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ(ఎండీ/ఎంఎస్) మెడికల్ కోర్సుల్లో నిర్వహించే ప్రాక్టికల్స్(ఓరల్) పరీక్షల్లో ఆడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన పీజీ మెడికల్, సూపర్‌స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో నిర్ణయించారు. పీజీ మెడికల్ పరీక్షల ఫలితాల్లో గ్రేస్ మార్కులు ఇవ్వకుండా ప్రశ్న పత్రాలను పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
గతంలో 10 మార్కులు చొప్పున 10 ప్రశ్నలు ఉండేవి. అలా కాకుండా 15 మార్కుల చొప్పున 5 ప్రశ్నలు, 5 మార్కులు చొప్పున 5 ప్రశ్నలు మొత్తం 100 మార్కులకు పరీక్ష పత్రాలను ఇవ్వాలని ప్రతిపాదించారు. పీజీలో థీసిస్ సమర్పణకు చేయడానికి ఆరు నెలలు గడువుగా నిర్ణయించారు. పరిశోధనా అంశాన్ని మార్పు చేసుకోవాలనుకునేవారికి మరో ఆరు నెలలు గడువిస్తారు. ఒక్క సంవత్సరంలో మొత్తం పరిశోధన (డిజర్జటేషన్ మెయిన్ టాపిక్ ) అంశం ఆమోదం పొందాలి. అప్పటికీ నిర్దేశించిన సంవత్సర కాలంలోగా పరిశోధనాంశం ఆమోదం పొందకపోతే రూ.10వేల జరిమానా విధిస్తారు. నిర్దేశించిన కాలంలో పరీక్షలకు అనుమతించకుండా ఎంతకాలం ఆలస్యం చేస్తే.. అంత కాలం కోర్సును పొడిగిస్తారు. అలాగే సంబంధిత విద్యార్థి గైడ్‌ను కూడా సంవత్సరం పాటు బ్లాక్ లిస్టులో ఉంచుతారు.
ప్రతి విద్యార్థి నాణ్యమైన వైద్య విద్యనభ్యసించేలా వైద్య విద్య ప్రొగ్రామ్స్ నిర్వహించడం, పాల్గొనడం, అలాగే ఎన్టీఆర్ హెల్ ్తయూనివర్సిటీ మెడ్‌నెట్ ద్వారా పంపే జర్నల్స్‌ను, అన్ని కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా వినియోగించుకొనేలా చర్యలకు సిఫార్సు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆరు మాసాలకొకసారి యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తుంది. తద్వారా ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో లోటుపాట్లు సరిచేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు లాగ్ బుక్ ఏర్పాటు చేయడం, డిజర్జటేషన్లో రెండు పేపర్లు ప్రచురితం కావడంతోపాటు 75 శాతం అటెండెన్స్ ఉంటేనే సంబంధిత విభాగాధిపతి ధ్రువీకరణతో హాల్‌టికెట్టు ఇవ్వాలని నిర్ణయించారు. హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ ఐవీ రావు అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆయా మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.