ఆ కొమ్మ మీద సచిన్! ఈ కొమ్మ మీద షారుక్!!
ఫలప్రేమ
‘‘అరే... సచిన్ టెండుల్కర్ ఈ గాలికి పడిపోతాడా ఏమిటి?’’
‘‘ఆ కొమ్మ చివర్లో రాజసంగా ఊగుతున్న అఖిలేష్ యాదవ్‌కు ఎంత డిమాండ్ అనుకుంటున్నారు? ఎక్కడెక్కడి నుంచో కొనడానికి వస్తున్నారు.’’
‘‘షారుక్ ఖాన్‌ను మరీ మరీ అడుగుతున్నారు... పది కోసి బుట్టలో వేయండి.’’
సచిన్ గాలికి పడిపోవడమేమిటి? కొమ్మ చివర్లో ఉన్న అఖిలేష్‌కు డిమాండ్ ఏమిటి? ఖాన్‌ను బుట్టలో వేయడం ఏమిటి?
కొత్త వాళ్లు ఎవరైనా వింటే వాటిని ‘పిచ్చి’ మాటలు అనుకుంటారు. కానీ ఖాన్‌గారి మామిడిపండ్ల పిచ్చి తెలిసిన వాళ్లు మాత్రం తేలిగ్గానే తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్ నివాసి హాజీ కరీముల్లాఖాన్‌కు మామిడి పండ్లను ప్రేమగా పెంచడంతో పాటు, వాటికి మురిపెంగా పేరు పెట్టుకోవడం కూడా ఇష్టం.
1957 నుండి మామిడి సాగు చేస్తున్న ఖాన్ ఇప్పటి వరకు ఎన్నో రకాల పండ్లను పండించాడు. వాటికి ప్రముఖుల పేర్లు పెట్టి పిలుచుకోవడం ఆయనకు ఒక సరదా.
17 సంవత్సరాల వయసులోనే 300 రకాల మామిడి పండ్లను పండించడం ద్వారా ఉత్తరప్రదేశ్ మామిడి సాగులో రికార్డ్ సృష్టించాడు. ఆయన మామిడి తోటలో ‘మ్యాజిక్ ట్రీ’ పేరుతో వందసంవత్సరాల చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకు కాసే రకరకాల కాయలు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. బీహార్, బెంగాల్ నుంచి రకరకాల మామిడి చెట్లను తన ప్రాంతానికి పరిచయం చేసిన ఘనత కూడా ఖాన్‌కు దక్కుతుంది.
ఖాన్‌కు వ్యవసాయంలో ఎలాంటి డిగ్రీ లేదు. ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మామిడిపండ్లను పండించడం అనేది తనకు దేవుడు ఇచ్చిన వరం అంటాడు. మలిహాబాద్ రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న ఖాన్ 14 ఎకరాల మామిడితోటను దేశవ్యాప్తంగా ఎందరో సందర్శిస్తుంటాను.
‘‘వేరే వ్యాపారంలో ఉండి ఉంటే చాలా డబ్బు సంపాదించే వాడినేమో. కానీ నాకు డబ్బు ముఖ్యం కాదు. ఈ మామిడి వల్ల నాకు చాలా గుర్తింపు, గౌరవం లభించాయి. అది చాలు’’ అంటున్నాడు ఖాన్.
2008లో ‘పద్మశ్రీ’తో ఖాన్‌ను గౌరవించింది ప్రభుత్వం.
‘‘భారీ మొత్తంలో డబ్బు ఇస్తాం. కాస్త మా తోటను గాడిలో పెట్టండి’’ అని దేశవిదేశాల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా ఖాన్ సున్నితంగా తిరస్కరించేవాడు. ఎందుకో ఆయన మాటల్లోనే విందాం.
‘‘ఈ తోట నాకు ఆక్సిజన్ లాంటిది. ఇక్కడ నుంచి వెళితే నేను బతకలేను.’’
‘‘మీకు ఎంత మంది పిల్లలు?’’ అని అడిగితే తన ఎనిమిది మంది పిల్లల గురించి కాకుండా-
‘‘తోటలోని పండ్లన్నీ నా పిల్లలే’’ అంటాడు ఎంతో ప్రేమగా!
అందుకే కాబోలు ఖాన్‌ను ‘మ్యాంగో కింగ్’, ‘మ్యాంగో మెజిషియన్’ అని పిలుస్తారు.
‘‘మీకు ఎంత మంది పిల్లలు?’’ అని అడిగితే తన ఎనిమిది మంది పిల్లల గురించి కాకుండా-‘‘తోటలోని పండ్లన్నీ నా పిల్లలే’’ అంటాడు ఎంతో ప్రేమగా!
అందుకే కాబోలు ఖాన్‌ను ‘మ్యాంగో కింగ్’, ‘మ్యాంగో మెజీషియన్’ అని పిలుస్తారు.