pharma unit
-
ఫార్మా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. ‘సోమవారం ఉదయం 8 గంటలకు మాకు సమాచారం అందింది. అది ఫార్మా సంస్థకు చెందిన గోదాం. మంటలను అదుపు చేశాం.’ అని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు... అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లాగున్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం) జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్‌ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్లోని రెస్టారెంట్లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్) దివీస్ ల్యాబొరేటరీస్ పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్‌కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది. -
ఊపిరి తీసిన విష వాయువులు
పరవాడ (పెందుర్తి): విష వాయువులు ఊపిరి తీసేశాయి... అప్పటి వరకూ తోటి వారితో కలిసి పనిచేస్తుండగా సంభవించిన దుర్ఘటనతో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉంది. జేఎన్ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయ్శ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ – 1లోని రియాక్టరు సమీపంలో కొత్త బ్యాచ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కారి్మకులు రసాయనాలను కలుపుతుండగా ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో షిఫ్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సబ్బవరం దరి మల్లునాయుడుపాలేనికి చెందిన పి.అప్పారావు (38), ఆపరేటర్లుగా పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన బి.చంద్రమోహన్ (34), విశాఖకు చెందిన సీహెచ్.శ్రీధర్ (38)లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఆపరేటర్ బొబ్బిలి దరి చింతాడకు చెందిన సురేష్‌కుమార్ (32), హెల్పర్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నవీన్ (32) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు గంటల అనంతరం వారు స్పహ కోల్పోవడంతో విషయం తెలుసుకున్న యాజమాన్యం రాంకీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ సీహెచ్.శ్రీధర్ గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి, చెల్లి ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ మృతదేహన్ని చూపించకుండా కేజీహెచ్‌కు తరలించడంపై అతని భార్య, బంధువులు గాజువాకలోని ఆస్పత్రి వద్ద కొంతసేపు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న పరవాడ సీఐ రఘువీర్ విష్ణు, పరవాడ తహసీల్దార్ గంగాధర్ ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. భద్రత ప్రమాణాలు పాటించకే... విజయశ్రీ ఆర్గానిక్స్ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఫార్మా సిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పరిశ్రమ వద్ద విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి ప్రమాదం జరిగితే గురువారం వరకు గోప్యంగా ఉంచడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ఇన్‌స్ఫెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫార్మాసిటీ లో విష వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పీసీబీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. విజయశ్రీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ కుటుంబానికి, అస్వస్థతకు గురైన వారికి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
భారత్‌లో జీఎస్కే మరో ఫార్మా యూనిట్
ముంబై: అంతర్జాతీయ ఔషధ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఇండియాలో మరో ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 8.5 కోట్ల పౌండ్లు(రూ. 864 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 250 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సమావేశంలో భాగంగా ఇండియాకు వచ్చిన కంపెనీ సీఈవో ఆండ్రూ విట్టీ ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఔషధ తయారీ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసేదీ ఇంకా నిర్ణయించలేదని చెబుతూ బెంగళూరు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించారు. ఇండియాలో దీర్ఘకాలంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తమ సంస్థ ప్రజలకు చౌక ధరలలో ఔషధాలను అందించే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పారు. దేశీయ మార్కెట్లకు ఔషధాలను అందించే ఈ ప్లాంట్ పూర్తయితే 800 కోట్ల ట్యాబ్లెట్లు, వంద కోట్ల క్యాప్సూల్స్‌ను తయారు చేయగలుగుతుందని తెలిపారు. 2017కల్లా ప్లాంట్ సిద్ధంకాగలదని భావిస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీ దేశీయంగా రూ. 1,017 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ మొత్తం 8,500 మంది సిబ్బందిని కలిగి ఉంది. కంపెనీ చర్మవ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు, వ్యాక్సిన్ల విభాగంలో ముందుంది. కంపెనీ వినియోగదారుల విభాగం సైతం హార్లిక్స్ బ్రాండ్‌తో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి, నాభా, సోనేపట్‌లో మూడు ప్లాంట్లలో వినియోగ సంరక్షణ ఉత్పత్తులు, నాసిక్‌లో రెండు ఔషధ ప్లాంట్లను కలిగి ఉంది.