ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం)
జూబిలెంట్ ఫుడ్ వర్క్స్
పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్‌ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్‌లోని రెస్టారెంట్‌లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్‌బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్‌ఎం స్పీడ్)
దివీస్ ల్యాబొరేటరీస్
పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్‌ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్‌కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment