న్యూఢిల్లీ: ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 67 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 97 కోట్లకుపైగా ఆర్జించింది.
డోమినోస్ పిజ్జా, డంకిన్ స్టోర్ల కంపెనీ మొత్తం అమ్మకాలు మాత్రం రూ. 1,955 కోట్లకు ఎగశాయి. గత క్యూ2లో రూ. 1,369 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,290 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగాయి. అయితే ఫలితాలు పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. సొంత అనుబంధ సంస్థ జూబిలెంట్ ఫుడ్ నెదర్లాండ్స్ బీవీ.. 2024 మార్చికల్లా డీపీ యూరేషియా ఎన్‌వీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఈ కాలంలో 139 స్టోర్లను కొత్తగా జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,467 కోట్లను తాకింది. అంతర్జాతీయ అమ్మకాలు దాదాపు రూ. 461 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 602 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment