ఒకే రెగ్యులేటరీతో ఔషధ ధరలు తగ్గుతాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఒకే రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఔషధ ధరలను నియంత్రించవచ్చని ఫార్మారంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ దేశాలకు ఒక్కొక్క రెగ్యులేటరీ విధానం ఉండటం వల్ల వ్యయాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. యునెటైడ్ స్టేట్స్ ఫార్మాకోపియల్ కన్వెన్షన్ (యూఎస్పీ) ఇండియా కార్యకలాపాలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ వేల్యూ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్లో ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ జనరల్ డెరైక్టర్ పి.వి.అప్పాజీ మాట్లాడుతూ ఈ రెగ్యులేటరీ నిబంధనల వల్ల చిన్న ఫార్మా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడానికి ప్రవేశపెట్టిన ‘జన ఔషధి’ ఒక చక్కటి కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్డీఏ ఇండియా డెరైక్టర్ మాథ్యూ థామస్, యూఎస్పీ సీఈవో డాక్టర్ రొనాల్డ్, ఆవ్రా ల్యాబరేటరీస్ సీఎండీ ఎ.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు.