భలే... భలే.. బ్యాటరీ కారు
నరసరావుపేట: స్కూటర్లు, మోటర్ సైకిళ్లకు చెందిన తీసేసిన విడిభాగాలను ఉపయోగించి విద్యుత్ సహాయంతో నడిచే బ్యాటరీ కారును తయారుచేశారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం చివరి సంవత్సరం చదువుతున్న జాన్ సందీప్, ఆర్.భార్గవ్‌లు ఈ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు.
దీనికోసం మూడు నెలలపాటు శ్రమించి రెండు సీట్ల కారును తయారుచేశారు. దీన్ని ఒకసారి చార్జిచేస్తే ఇద్దరు వ్యక్తులు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని. ఒకరైతే 80 కిలోమీటర్లు వరకూ ప్రయాణించవచ్చని వారు చెబుతున్నారు. ఇటువంటి కార్లు శబ్దకాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడతాయంటున్నారు.
దీని తయారీకి రూ.50 వేలు ఖర్చయిందని, ఒకేసారి పెద్ద మొత్తంలో తయారుచేస్తే రూ.30 వేలకే తయారు చేయవచ్చంటున్నారు. ఈ కారుకు ‘ఫినిక్స్’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. వీరిద్దరూ ఆ కారుపై పట్టణంలో ఎటువంటి శబ్దంలేకుండా రయ్‌మని దూసుకెళుతుంటే చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.