phone records
-
చోరీలకు చెక్.. మొబైల్ రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ల దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు టాప్ ప్లేస్ నిలిచి రికార్డు క్రియేట్ చేశారు. 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. వివరాల ప్రకారం.. పోగొట్టుకున్న ఫోన్లలో 39 శాతం రికవరీతో దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ సీఐడీ పోలీసులు టాప్ ప్లేస్‌లో నిలిచారు. టెలికాం డిపార్ట్ మెంట్ సీఈఐఆర్ అప్లికేషన్‌ను ఉపయోగించి 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్స్ రికవరీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. దీంతో, హిస్టరీ క్రియేట్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే, చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
ఓటుకు కోట్లు కుట్రను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మార్కం టేలర్
-
అయోధ్యలో ఆంక్షలు
అయోధ్య/న్యూఢిల్లీ: రామమందిరం–బాబ్రీ మసీదుపై నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యలో పలు ఆంక్షలు విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈవిషయంలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చర్చలు జరపకుండా ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేస్తామని తెలిపింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో అసత్యాల ప్రచారం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తీర్పు వెలువడిన రోజు దేవతా విగ్రహాల ప్రతిష్టాపన, విజయోత్సవ ఊరేగింపులు జరపకుండా నిషేధం విధించారు. రాళ్లు సేకరించడం, కిరోసిన్, యాసిడ్ అమ్మకాలు కూడా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల, పోలీసుల సెలవులను యూపీ ప్రభుత్వం రద్దుచేసింది. -
మాటలొద్దు.. ఇంటికే వచ్చేయ్ – తమ్ముడూ జాగ్రత్త
పెద్దపల్లి : స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ ఆప్షన్లున్నాయి జాగ్రత్త.. నిన్న మొన్నటి వరకు ఉన్న సెల్ఫోన్లో రికార్డ్ చేస్తున్నట్లు కనీసం అనుమానమైనా వచ్చేది.. కొత్త స్మార్ట్ఫోన్లతో ఇవతలి వ్యక్తి వాయిస్ రికార్డ్ అవుతోంది తస్మాత్ జాగ్రత్త.. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకే సెల్‌ఫోన్ వాయిస్ రికార్డు చుక్కలు చూపించడంతో అన్ని వర్గాల వారు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చి పడింది. రాజకీయ నాయకులైనా.. కార్యకర్తలైనా.. ఉద్యోగులు, అధికారులైనా.. అందరి మధ్య చిచ్చుపెట్టేందుకు వాయిస్ రికార్డు ప్రత్యర్థులు అస్త్రంగా వాడుకుంటున్నారు. పెద్దపల్లిలో సంచలనం సృష్టిస్తున్న వాయిస్ రికార్డు అన్ని వర్గాల వారిలో వణుకు పుట్టిస్తోంది. ఫోన్ మాట్లాడితే జాగ్రత్త.. జాగ్రత్త.. అంటూ హెచ్చరికలు అందుతున్నాయి. ఏ విషయమైనా గుట్టు చప్పుడు కాకుండా ఎడామాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని ఇటీవల జరిగిన వాయిస్ రికార్డు ఉదంతాలు సంచలనం రేపుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల వాయిస్ రికార్డు ప్రస్తుతం పోలీస్ కేసుల వరకు చేరుకున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ సారయ్యగౌడ్ ఓ పంచాయతీలో పెద్దగా వ్యవహరిస్తూ చేసిన సంభాషణలు చట్టపరంగా విచారణ ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది. మంగపేటలో మహిళకు జరిగిన అవమానంపై పెద్దపల్లిలో పంచాయతీ నిర్వహించగా, అందులో సారయ్యగౌడ్ మాటలను రికార్డు చేసి వాట్సాప్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. చివరికి ఆయన మాటలపైనే పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఇక మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ముత్తారంకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదంలో చిక్కుకున్నారు. గంజాయి కేసు విచారణ మొదలైంది. హైదరాబాద్ నుంచి మంథని వరకు ప్రస్తుతం వాయిస్ రికార్డు వాట్సాప్‌లో హల్చల్తో సెల్ఫోన్లు ఉన్న వారు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఎదుటి వ్యక్తిని దెబ్బతీసేందుకు వాయిస్ రికార్డును అస్త్రంగా వాడుకుంటున్నారు. గతంలో కంటే కొత్త సెల్ఫోన్లు మార్కెట్లోకి రావడంతో వాయిస్రికార్డుపై ఎలాంటి అనుమానం రాకుండానే ప్రతి పదం రికార్డవుతోంది. చాలా మంది నాయకులు తమ గురించి ఎదుటి వారు మాట్లాడుకుంటున్న సంభాషణలను రికార్డు ద్వారా వినిపించాలని చేస్తున్న ప్రయత్నాలు చివరికి బెడిసి కొడుతున్నాయి. దగ్గర కావాలన్న ప్రయత్నంలో భాగంగా వాయిస్ రికార్డు వినిపించే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఫోన్లో మాట్లాడేందుకే జంకుతున్నారు. తాజా పరిణామాలతో వణుకు పెద్దపల్లిలో తాజా రాజకీయ పరిణామాలతో అన్ని పార్టీల్లోనూ సెల్‌ఫోన్ వాయిస్ రికార్డు అప్రమత్తత తీసుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరడంతో వేడి పుట్టింది. ఫోన్లో పలకరిస్తే అవతలి వ్యక్తి నీవెక్కడున్నావ్.. అక్కడికే వస్తా.. అంటూ సమాధానమివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. విజయరమణారావు టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయ న అనుచరులకు గాలం వేసే పనిలో ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. అయితే ఎవరు ఎటు మాట్లాడుతున్నారో.. ఎవరి ఫోన్ కాన్ఫరెన్స్ ఉందో తెలియక ప్రముఖ నాయకులు సైతం ఇంటికి వస్తేనే మాట్లాడతామంటూ సమాధానమివ్వడం కొసమెరుపు. -
ఫోన్ రికార్డుల ఆధారంగా కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: ఫోన్ రికార్డుల అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న ప్రస్తుత తరుణంలో లంచం తీసుకున్న ఓ కానిస్టేబుల్‌ను ఫోన్ రికార్డుల ఆధారంగా విజిలెన్స్ పోలీసులు అరెస్టుచేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఢిల్లీలోని మయూర్ విహార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న నరేశ్ కుమార్.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి విడిచిపెట్టేందుకు అతడి కుటుంబసభ్యుల నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. బేరసారాల అనంతరం రూ. 7 వేలకు డీల్ సెట్ అయింది. డబ్బును రెండు దఫాలుగా ఇచ్చేందుకు నిందితుడి స్నేహితుడు ముందుకొచ్చాడు. ఆ క్రమంలోనే సదరు కానిస్టేబుల్‌తో మొబైల్ ఫోన్లో జరిపిన సంభాషణలు అన్నింటిని రికార్డుచేసిన స్నేహితుడు.. వాటిని ఆధారాలుగా సమర్పించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆడియో రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించిన పిదప, కానిస్టేబుల్ నరేశ్ కుమార్ లంచం డిమాండ్ చేసింది నిజమేనని తేలడంతో విజిలెన్స్ అధికారులు బుధవారం అతనిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, కానిస్టేబుల్‌ను కోర్టులో హాజరు పర్చుతామని అధికారులు చెప్పారు.