ఫోన్ రికార్డుల ఆధారంగా కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: ఫోన్ రికార్డుల అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న ప్రస్తుత తరుణంలో లంచం తీసుకున్న ఓ కానిస్టేబుల్ను ఫోన్ రికార్డుల ఆధారంగా విజిలెన్స్ పోలీసులు అరెస్టుచేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఢిల్లీలోని మయూర్ విహార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోన్న నరేశ్ కుమార్.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి విడిచిపెట్టేందుకు అతడి కుటుంబసభ్యుల నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. బేరసారాల అనంతరం రూ. 7 వేలకు డీల్ సెట్ అయింది.
డబ్బును రెండు దఫాలుగా ఇచ్చేందుకు నిందితుడి స్నేహితుడు ముందుకొచ్చాడు. ఆ క్రమంలోనే సదరు కానిస్టేబుల్తో మొబైల్ ఫోన్లో జరిపిన సంభాషణలు అన్నింటిని రికార్డుచేసిన స్నేహితుడు.. వాటిని ఆధారాలుగా సమర్పించి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆడియో రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలించిన పిదప, కానిస్టేబుల్ నరేశ్ కుమార్ లంచం డిమాండ్ చేసింది నిజమేనని తేలడంతో విజిలెన్స్ అధికారులు బుధవారం అతనిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, కానిస్టేబుల్ను కోర్టులో హాజరు పర్చుతామని అధికారులు చెప్పారు.