photo upload
-
రైల్వే ఉద్యోగార్థులకు మరో అవకాశం
న్యూఢిల్లీ: తిరస్కరణకు గురైన దరఖాస్తులను సరిచేసుకునేందుకు సుమారు 70 వేల మంది అభ్యర్థులకు రైల్వే శాఖ మరో అవకాశం ఇచ్చింది. ఫొటోలు సరిగా అప్లోడ్ కాకపోవడం వల్ల జరిగిన దోషాలను సరిదిద్దుకోవడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు. అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాల కోసం వచ్చిన 48 లక్షల దరఖాస్తుల్లో 1.27 లక్షల దరఖాస్తుల్లో ఫొటోలు సరిగా అప్లోడ్ కాలేదని గుర్తించారు. అందులో, 70 వేల మంది ఫొటోల్లో మార్పులు చేసుకుని మళ్లీ అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం పంపారు. జూలై 18–20 మధ్య రైల్వే నియామక బోర్డు వెబ్సైట్లో ఈ తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు. మిగిలిన 57 వేల దరఖాస్తుదారులను కూడా పరిశీలించామని, వాటిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. -
ఎఫ్బీలో యువతి ఫొటో పెట్టారని...
రాయచూరు రూరల్: సామాజిక మాధ్యమాల్లో యువతి ఫొటోను అప్లోడ్ చేసినందుకు ప్రశ్నించిన బాధితురాలి తండ్రిపై యువకులు దాడి చేశారు. దీన్ని అవమానంగా భావించిన తండ్రీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటక సింధనూరు తాలూకా గౌడన బావిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామనగౌడ కుమార్తె బసలింగమ్మ(20) సింధనూరులో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ సింధనూరుకు వచ్చి వెళ్తుండేది. ఈక్రమంలో వారం రోజుల క్రితం గ్రామంలోని కొందరుయువకులు ఆ విద్యార్థిని ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. దీనిపై ఆదివారం రోజు యువతి తండ్రి సదరు యువకులను ప్రశ్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఓ దశలో యువకులు రామనగౌడపై దాడి చేశారు. ఈ ఘటనను అవమానంగా భావించిన రామనగౌడ, బసలింగమ్మలు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బళగనూరు పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఫొటో తీయండి.. పోస్ట్ చేయండి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో సమస్యలు ఉంటే.. ఆ ఫొటో తీసి పాలికె యాప్‌లో అప్లోడ్ చేస్తేచాలు, పరిష్కారం బాధ్యత పాలికెదే. సోమవారం పాలికె కేంద్రకార్యాలయంలో మేయర్ సంపత్‌రాజ్, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ ‘మా వీధులను సరిచేయండి’ అనే యాప్‌ను విడుదల చేశారు. మేయర్ మాట్లాడుతూ పాలికె పరిధిలోని రోడ్లు, చెత్త తదితర ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ యాప్ ఎంతో అనుకూలమవుతుందని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. bbmpfixmystreet యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోడ్డుపై గుంత, చెత్త, మురుగు సమస్య ఉన్నట్టయితే, ఒక ఫొటో తీసియాప్‌లో అప్లోడ్ చేయాలి. దానిపై అధికారులు స్పందిస్తారు. డ్యాష్‌బోర్డు ద్వారా సమస్యల పరిష్కారానికి అదికారుల నుంచి చర్యలు తీసుకుంటామని సంపత్‌రాజ్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో ఇబ్బందులపై ప్రజలు బీబీఎంపీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయాల్సివచ్చేది. అక్కడి నుంచి వార్డుకు, అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేయడానికి సమయం పట్టేది. ప్రస్తుతం విడుదల చేసిన యాప్ ద్వారా నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ చెప్పారు. ఏ సమస్యకు ఎంత సమయం? చెత్త సమస్య ఉంటే ఒక్కరోజులోగా పరిష్కరించాలని అధికారులకు మేయర్ సూచించారు. వీధి దీపాల సమస్యను రెండురోజులు, రోడ్లు గుంతల సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. బెస్కాం, ఆరోగ్య శాఖ, బీడీఏ, ఉద్యానవనశాఖ తో పాటు వివిద శాఖలు యాప్ సమాచారాన్ని అందుకుంటాయి. ప్రతి అధికారి, కార్పొరేటర్లకు సమాచారం వెళ్తుందని మేయర్ తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ ఫోటోను అప్లోడ్ కోరారు. నగరమంతటా ఎల్ఈడీ బల్బులు అనంతరం పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ... యాప్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలస్యమైతే అధికారులు అందుకు కారణాన్ని ఫిర్యాదిదారుకు తెలియజేయాలి. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో పాత విద్యుత్దీపాలను తొలగించి ఎల్ఇడి బల్ప్‌లను ఏర్పాటు చేయడానికి నివేదికను సిద్ధం చేశామని, మూడునాలుగు నెలల్లోగా టెండర్లు ఆహ్వానించి 8 నెలల్లోగా నగరంలోని అన్ని వీదులకు విద్యుత్దీపాలను ఎల్‌ఇడీగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె పాలనా విభాగం నేత రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీలో ‘వాట్స్‌యాప్’ వార్
* అమ్మాయి ఫొటోను అప్లోడ్ చేసే విషయంపై వివాదం * క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన యువకుడు దారుస్సలాంలో ఘటన * ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు * దాడిచేసిన విద్యార్థిని కళాశాల నుంచి బహిష్కరించిన యాజమాన్యం * నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్: ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వాట్స్‌యాప్ (మొబైల్ అప్లికేషన్) వివాదం చివరకు ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. గాయపడిన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన జునైద్ మొహియుద్దీన్ ఖాన్(18), భవానీనగర్‌కు చెందిన మాజ్ రబ్బానీ(18)లు.. దారుస్సలాంలోని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీఈ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ స్నేహితులు. ఇటీవల తమ సెల్ఫోన్లో వాట్స్‌యాప్ ఫ్రెండ్స్ గ్రూపును తయారు చేశారు. ఈ గ్రూపును రబ్బానీ నిర్వహిస్తున్నాడు. కాగా, జునైద్ ఒక అమ్మాయి ఫొటోను వాట్స్‌యాప్‌లో అప్లోడ్ చేయాలని రబ్బానీని కోరాడు. దీనికి రబ్బానీ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. మంగళవారం కళాశాలకు వచ్చాక ఇద్దరూ మరోసారి వాట్స్యాప్పై వాగ్వాదానికి దిగారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన రబ్బానీ తన బ్యాగులో ఉన్న కత్తి తీసుకుని జునైద్ వెనుక వైపు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన జునైద్ అక్కడే రక్తపుమడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జునైద్‌కు రెండు చోట్ల కత్తిపోట్లు పడ్డట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రబ్బానీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తమ కళాశాల ప్రాంగణంలో జరగలేదని, దాడికి పాల్పడిన రబ్బానీని కళాశాల నుంచి బహిష్కరించినట్లు దక్కన్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే కళాశాలలో గతంలో ఓ విద్యార్థి రివాల్వర్‌తో కాల్పులు జరిపి కలకలం సృష్టించినట్లు తెలిసింది.