* అమ్మాయి ఫొటోను అప్‌లోడ్ చేసే విషయంపై వివాదం
* క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన యువకుడు దారుస్సలాంలో ఘటన
* ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
* దాడిచేసిన విద్యార్థిని కళాశాల నుంచి బహిష్కరించిన యాజమాన్యం
* నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వాట్స్‌యాప్ (మొబైల్ అప్లికేషన్) వివాదం చివరకు ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. గాయపడిన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన జునైద్ మొహియుద్దీన్ ఖాన్(18), భవానీనగర్‌కు చెందిన మాజ్ రబ్బానీ(18)లు.. దారుస్సలాంలోని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీఈ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ స్నేహితులు. ఇటీవల తమ సెల్‌ఫోన్‌లో వాట్స్‌యాప్ ఫ్రెండ్స్ గ్రూపును తయారు చేశారు. ఈ గ్రూపును రబ్బానీ నిర్వహిస్తున్నాడు. కాగా, జునైద్ ఒక అమ్మాయి ఫొటోను వాట్స్‌యాప్‌లో అప్‌లోడ్ చేయాలని రబ్బానీని కోరాడు. దీనికి రబ్బానీ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.
మంగళవారం కళాశాలకు వచ్చాక ఇద్దరూ మరోసారి వాట్స్‌యాప్‌పై వాగ్వాదానికి దిగారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన రబ్బానీ తన బ్యాగులో ఉన్న కత్తి తీసుకుని జునైద్ వెనుక వైపు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన జునైద్ అక్కడే రక్తపుమడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జునైద్‌కు రెండు చోట్ల కత్తిపోట్లు పడ్డట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రబ్బానీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తమ కళాశాల ప్రాంగణంలో జరగలేదని, దాడికి పాల్పడిన రబ్బానీని కళాశాల నుంచి బహిష్కరించినట్లు దక్కన్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే కళాశాలలో గతంలో ఓ విద్యార్థి రివాల్వర్‌తో కాల్పులు జరిపి కలకలం సృష్టించినట్లు తెలిసింది.
కాలేజీలో ‘వాట్స్‌యాప్’ వార్
Published Wed, Dec 10 2014 3:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement