darussalam
-
మగాళ్లకో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా?
సాక్షి ,హైదరాబాద్: ‘బుర్ఖా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్ఖా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. ముస్లిం యువకుడు ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం యువతి మాత్రం అలా కనిపించకూడదా? మగాళ్లకో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?.. ’అని అఖిల భారత మజ్లిస్–ఇ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలంలో మిలాద్–ఉన్–నబీ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం, దేశం మారిందని.. ఇది 1969 కాదని, 2021లో ఉన్నామని గ్రహించాలని, కాలానికి తగట్టుగా మారక తప్పదని స్పష్టం చేశారు. సైనికులు మరణిస్తుంటే పాక్‌తో క్రికెట్టా? దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మన సైనికులు మరణిస్తుంటే ఆ దేశంతో భారత్ టీ– 20 మ్యాచ్ ఆడుతుందా? అని ప్రధాని మోదీపై ఒవైసీ ధ్వజమెత్తారు. తాజాగా ఉగ్రమూకల దాడి లో సుమారు తొమ్మిది మందికి పైగా సైనికులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ నిత్యం భారత పౌరుల జీవితాలతో 20–20 మ్యాచ్ ఆడుతోందని, జమ్మూకశ్మీర్‌లో పౌరుల నరమేధం కొనసాగుతోందని అన్నారు. నిఘా విభాగం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని నిలదీశారు. చైనా చొరబడి లడఖ్‌లోని మన భూభాగంలో తిష్టవేసి కూర్చున్నా ఎందుకు మౌనంగా కూర్చున్నారని ప్రశ్నించారు. ధరల సవరణ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతుండటంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని చెప్పారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ధరలు నియంత్రించకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని ఓడించి తీరుతామని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి చోటా పోటీ చేసే అవకాశం పార్టీలకు ఉందని, పట్టు ఉన్న చోట పోటీ చేసి తీరుతామన్నారు. -
ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. సోమవారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దారుస్సలాంలో జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారి జరిగిందని పేర్కొన్నారు. బారిస్టర్ చదివిన ఎంపీ అసద్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా లోక్‌సభలో బిల్లును చింపడంపై మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి మసిపూసి మారేడు కాయ చేసి ప్రచారం చేస్తున్నారంటూ బాధపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమానాలుంటే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ.. ఇస్లామిక్ దేశాల్లోని ముస్లింలకు కూడా లేదన్నారు. గతంలో అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ రెండోసారి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవడంపై ఎందుకు స్పందించలేదని ఎంపీ అసదుదద్దీన్ను కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. -
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
-
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) చట్టాలంటే గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దారుస్సలాంలో జరిగిన భారీ సభలో అసద్ ప్రసంగించారు. ఎన్నార్సీ వల్ల నష్టాలే తప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకుతీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్.. జాతీయ గీతాలాపనతో సభ ముగించారు. -
నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి!
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మహత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు జీవించి లేనప్పటికీ వారి ఆశయాలు సజీవంగా ఉన్నాయి. మనమంతా భారతీయులమని బీజేపీ, సంఘ్పరివార్లకు ఘాటైన సమాధానం చెప్పేందుకు ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలి. ఎన్ఆర్సీ, సీఏఏ ఉపసంహరించే వరకు జెండాలు అలాగే ఉంచాలి’ అని పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యయుతంగా, హింసకు తావివ్వకుండా, శాం తియుతంగా కనీసం ఆరుమాసాలైనా ఆందోళన కొనసాగించాలన్నారు. భారతీయులందరిని రక్షించేందుకే ఈ పోరాటమన్నారు. కేరళలో మాదిరిగా తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ సీఏఏ, ఎన్ఆర్సీ వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జమాత్–ఇ–ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో కేంద్ర పాలకుల మెడలు వంచినట్లు.. అమిత్‌షా మెడలు వంచి చట్టం ఉపసంహరించేలా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాంకు చెందిన సామాజిక కార్యకర్త అబ్ధుల్ వదూర్ అమాన్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలోని సీఎంలు వీటి అమలును నిలిపివేయాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్దులు కూడా పాల్గొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సభను జాతీయ గీతంతో ప్రారంభించారు. -
కాలేజీలో ‘వాట్స్‌యాప్’ వార్
* అమ్మాయి ఫొటోను అప్లోడ్ చేసే విషయంపై వివాదం * క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన యువకుడు దారుస్సలాంలో ఘటన * ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు * దాడిచేసిన విద్యార్థిని కళాశాల నుంచి బహిష్కరించిన యాజమాన్యం * నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్: ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వాట్స్‌యాప్ (మొబైల్ అప్లికేషన్) వివాదం చివరకు ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు. గాయపడిన విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన జునైద్ మొహియుద్దీన్ ఖాన్(18), భవానీనగర్‌కు చెందిన మాజ్ రబ్బానీ(18)లు.. దారుస్సలాంలోని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీఈ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ స్నేహితులు. ఇటీవల తమ సెల్ఫోన్లో వాట్స్‌యాప్ ఫ్రెండ్స్ గ్రూపును తయారు చేశారు. ఈ గ్రూపును రబ్బానీ నిర్వహిస్తున్నాడు. కాగా, జునైద్ ఒక అమ్మాయి ఫొటోను వాట్స్‌యాప్‌లో అప్లోడ్ చేయాలని రబ్బానీని కోరాడు. దీనికి రబ్బానీ ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. మంగళవారం కళాశాలకు వచ్చాక ఇద్దరూ మరోసారి వాట్స్యాప్పై వాగ్వాదానికి దిగారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో ఉన్మాదిగా మారిన రబ్బానీ తన బ్యాగులో ఉన్న కత్తి తీసుకుని జునైద్ వెనుక వైపు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన జునైద్ అక్కడే రక్తపుమడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జునైద్‌కు రెండు చోట్ల కత్తిపోట్లు పడ్డట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రబ్బానీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తమ కళాశాల ప్రాంగణంలో జరగలేదని, దాడికి పాల్పడిన రబ్బానీని కళాశాల నుంచి బహిష్కరించినట్లు దక్కన్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే కళాశాలలో గతంలో ఓ విద్యార్థి రివాల్వర్‌తో కాల్పులు జరిపి కలకలం సృష్టించినట్లు తెలిసింది. -
కళాశాలలో ఘర్షణ : విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్: పాతబస్తీ దారుస్సలాంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు మంగళవారం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్న జిన్నత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థికి స్వల్ప గాయాలు కావడంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ముస్లింల సంక్షేమానికి వైఎస్ కృషి మరువలేనిది: అక్బరుద్దీన్
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ముస్లింల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఎంఐఎం పార్టీ 56వ వార్షికోత్సవం ఆదివారం పాతబస్తీలోని దారుస్సాలాంలో కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ ఉందంటే అది మహానేత ముస్లింలకు ఇచ్చిన వరమేనన్నారు. వైఎస్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎందరో ముస్లింలు వైద్యులు అయ్యారని తెలిపారు. 56వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ నగర మేయర్ మాజిద్, కార్పొరేటర్లులతోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.