సాక్షి ,హైదరాబాద్: ‘బుర్ఖా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్ఖా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. ముస్లిం యువకుడు ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం యువతి మాత్రం అలా కనిపించకూడదా? మగాళ్లకో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?.. ’అని అఖిల భారత మజ్లిస్–ఇ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలంలో మిలాద్–ఉన్–నబీ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం, దేశం మారిందని.. ఇది 1969 కాదని, 2021లో ఉన్నామని గ్రహించాలని, కాలానికి తగట్టుగా మారక తప్పదని స్పష్టం చేశారు.
సైనికులు మరణిస్తుంటే పాక్‌తో క్రికెట్టా?
దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మన సైనికులు మరణిస్తుంటే ఆ దేశంతో భారత్ టీ– 20 మ్యాచ్ ఆడుతుందా? అని ప్రధాని మోదీపై ఒవైసీ ధ్వజమెత్తారు. తాజాగా ఉగ్రమూకల దాడి లో సుమారు తొమ్మిది మందికి పైగా సైనికులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ నిత్యం భారత పౌరుల జీవితాలతో 20–20 మ్యాచ్ ఆడుతోందని, జమ్మూకశ్మీర్‌లో పౌరుల నరమేధం కొనసాగుతోందని అన్నారు. నిఘా విభాగం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని నిలదీశారు.
చైనా చొరబడి లడఖ్‌లోని మన భూభాగంలో తిష్టవేసి కూర్చున్నా ఎందుకు మౌనంగా కూర్చున్నారని ప్రశ్నించారు. ధరల సవరణ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతుండటంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని చెప్పారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ధరలు నియంత్రించకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని ఓడించి తీరుతామని అసదుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి చోటా పోటీ చేసే అవకాశం పార్టీలకు ఉందని, పట్టు ఉన్న చోట పోటీ చేసి తీరుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment